రాణీ రాంపాల్... హరియాణా కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద్‌కు చెందిన హాకీ క్రీడాకారిణి. ఆ రాష్ట్రంలో పద్మశ్రీ పురస్కారం గెలుచుకున్న ఏకైక యువతి.
ప్రాథమిక స్థాయిలోనే హాకీ స్టిక్‌తో..
రాణి తండ్రి రాంపాల్ గుర్రపు జట్కా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె ఇష్టం మేరకు 4వ తరగతిలో ఆమె చేతిలో హాకీ స్టిక్ పెట్టిన ఆయన ప్రోత్సాహంతో.. 13 ఏళ్లకే రాణి భారత హాకీ మహిళా జట్టులో చేరింది.
"అమ్మాయి అయినందుకు సమాజం ఎన్నో కారణాలు అడ్డుగా చూపింది. బయటకు పంపుతారా? క్రీడాకారిణిని చేస్తారా? అది సరికాదని ఏవేవో అన్నారు. కానీ తన అభిరుచి హాకీ. మేమూ చెప్పి చూశాం. కానీ.. ఎలాగైనా హాకీ ఆడాలని రాణి నిశ్చయించుకుంది. అందరి మాటలూ విన్నాం. కానీ.. ఆట నుంచి నా బిడ్డను దూరం చేయలేదు."
- రాంపాల్, రాణి తండ్రి
అనతి కాలంలోనే భారత కెప్టెన్‌గా..
రాణి 4వ తరగతిలో ఉన్నప్పుడు కొందరు అమ్మాయిలు హాకీ ఆడటం చూసి.. తానూ ఆ వైపు అడుగులు వేసింది. కొద్దికాలంలోనే ఆటపై పట్టు సాధించి, భారత జట్టుకు కెప్టెన్‌గా ఎదిగింది. రాణి ఆటలో ఎదుగుతున్న కొద్దీ కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతూ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున అద్భుతంగా ఆడి.. షహబాద్, హరియాణాకు పేరు తెచ్చింది రాణి. ఆమెను భీమ్ అవార్డు, అర్జున పురస్కారాలు కూడా వరించాయి.
"చాలా మాటలు విన్నాం. అవేవీ పట్టించుకోలేదు. ఆ మాటలు అన్నవాళ్లే ఇప్పుడు తమ పిల్లల్ని కూడా క్రీడల్లో చేర్చుతున్నారు. మీ బిడ్డను నువ్వే బయటికి పంపావు, నీదీ ఓ తల్లి హృదయమేనా అని కఠినంగా మాట్లాడేవారు."
- రామ్‌మూర్తి, రాణి తల్లి
తండ్రి పేరుకు సార్థకం చేస్తూ..
రాణికి పద్మశ్రీ అవార్డు దక్కడం తనకు ఎంతో గర్వకారణమని అంటున్నారు.. ఆమె తండ్రి రాంపాల్. హాకీ క్రీడాకారిణి అవాలన్న తన కుమార్తె కలను నిజం చేసేందుకు ఎన్నోకష్టాలు పడాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు తండ్రి పేరును తన పేరు చివరన చేర్చుకుని.. ఆయన కష్టానికి ప్రతిఫలం అందిస్తూ ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తోంది రాణీ రాంపాల్.
ఇదీ చదవండి: ఐపీఎల్: ఉమెన్స్ టీ20 లీగ్‌కు రంగం సిద్ధం