భారత హాకీ దిగ్గజం, మూడుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతకాల విజేత సీనియర్ బల్బీర్ సింగ్(95) మృతిచెందడంపై పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈరోజు ఉదయం మొహాలీలోని ఓ ఆస్పత్రిలో బల్బీర్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే సామాజిక మాధ్యమాల ద్వారా భారత హాకీ ఆటగాళ్లతో పాటు ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా, భారత హాకీ మాజీ సారథి విరెన్ రస్కిన్హా, షూటర్ హీనా సిద్ధు విచారం వ్యక్తం చేశారు.
- భారత ఒలింపిక్స్ స్వర్ణ పతకాల విజేత ఇక లేరని తెలిసి చాలా బాధగా ఉంది. ఒక ఆటగాడిగా, ఆదర్శప్రాయుడిగా బల్బీర్ సింగ్ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఆయనతో పరిచయం ఉండటం ఎంతో గర్వంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అథ్లెట్లకు.. ఆయన చరిత్ర ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది. -అభినవ్ బింద్రా
- మూడుసార్లు ఒలింపిక్ స్వర్ణ విజేత, దిగ్గజ ఆటగాడు బల్బీర్ సింగ్ మృతి బాధాకరం. దిల్లీలో ఆయన్ను ఒకసారి కలిశాను. అదే చివరిసారి కూడా. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూనే ఉండేవారు. ఆయన గొప్ప ఆటగాడు. -విరెన్ రస్కిన్హా
- బల్బీర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన దగ్గరికెళ్లి చాలా సార్లు కలిసేందుకు ప్రయత్నించినా అది కుదరలేదు. ఆయనకు నేనో వీరాభిమానిని. ఏదో ఒకరోజు బల్బీర్‌తో ఫొటో తీసుకోవాలనుకున్నా. బాధగా ఉన్నా ఇప్పుడాయన మన జ్ఞాపకాల్లో మిగిలిపోయారు. -హీనా సిద్ధు
- ఆల్‌టైమ్ అత్యుత్తమ ప్లేయర్, దిగ్గజ ఆటగాడు సీనియర్ బల్బీర్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలి. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. -భారత హాకీ క్రీడాకారుడు మన్‌ప్రీత్ సింగ్
- దిగ్గజ ఆటగాడి మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నా. బల్బీర్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలి. -భారత హాకీ గోల్‌కీపర్ శ్రీజేశ్
- దిగ్గజ ఆటగాడు బల్బీర్ సింగ్ మృతిచెందడం బాధ కలిగించింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. -విరాట్ కోహ్లీ
- భారత దిగ్గజ ఆటగాడు సీనియర్ బల్బీర్ సింగ్ ఇక లేరు. ఆయన సాధించిన విజయాలు చూస్తే ఆశ్చర్యపోతారు. మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, ఒలింపిక్ ఫైనల్లో ఐదు గోల్స్. 1975 ప్రపంచకప్ సాధించిన జట్టుకు మేనేజర్. భారత అత్యుత్తమ దిగ్గజాలలో ఒకరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. -హర్భజన్‌సింగ్