ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మృతిపై భారత ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగోకు టీమ్‌ఇండియాలోనూ విశేషమైన అభిమానులున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నుంచి ప్రధాన కోచ్ రవిశాస్త్రి వరకు ఈ దిగ్గజానికి ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. మాజీ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌తో పాటు అనిల్ కుంబ్లే, రవి చంద్రన్ అశ్విన్ లాంటి స్పిన్నర్లు ఉన్నారు. వీరంతా డీగో మృతికి సంతాపం తెలిపడంతో పాటు తమ చిన్ననాటి హీరో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
- డీగో మారడోనా ఫుట్‌బాల్ దిగ్గజం. తన కెరీర్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ ఆటలో అతడు మర్చిపోలేని అనుభూతులు మిగిల్చాడు. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లడం అందర్నీ బాధకు గురిచేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. - ప్రధాని నరేంద్ర మోదీ
- డీగో లాంటి దిగ్గజం మనల్ని వదిలి వెళ్లారు. ఫుట్‌బాల్ క్రీడను అందమైన ఆటగా మార్చిన మాంత్రికుడు. అతడి సన్నిహితులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా. -రాహుల్ గాంధీ
- తన ఆటతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న డీగో మారడోనా అరుదైన క్రీడాకారుడు. అతడి మరణం ఆ క్రీడా రంగానికే తీరని లోటు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. అతడి ఆత్మకు శాంతి కలగాలి. -ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- క్రీడా ప్రపంచానికి ఇదో పెద్దలోటు. తన ఆటతో ఎన్నో మధురజ్ఞాపకాలు మిగిల్చిన మన చిన్ననాటి స్టార్ లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. డీగో మారడోనా మీరెప్పటికీ మా మదిలో ఉంటారు. -సురేశ్ రైనా
- డీగో క్రీడాలోకంలోనే అతిగొప్ప ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడి మరణవార్త కలచివేసింది. తన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. -వీరేంద్రసెహ్వాగ్
- ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకరైన డీగో మారడోనా మనల్ని విడిచి వెళ్లిపోయారు. క్రీడా ప్రపంచానికి ఇదో బాధాకరమైన సందర్భం. అతడి ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి. -వీవీఎస్ లక్ష్మణ్
- క్రీడా ప్రపంచానికి, ఫుట్‌బాల్ క్రీడకు ఇది తీరని లోటు. నేను ఫుట్‌బాల్ ఇష్టపడేందుకు కారణం మీరే. మీ ఆత్మకు శాంతి కలగాలి ఛాంపియన్ డీగో. - అనిల్‌కుంబ్లే
- ఈ క్రీడా ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ కోల్పోతుంది. రెస్ట్ ఇన్ పీస్ డీగో. - రవిచంద్రన్ అశ్విన్
- దిగ్గజ ఆటగాడు మారడోనా మృతిచెందారని తెలిసి చాలా బాధగా ఉంది. అతడు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. తన ఆటతో మైదానంలో మధుర జ్ఞాపకాలు మిగిల్చాడు. రెస్ట్ ఇన్ పీస్ డీగో. మిమ్మల్ని కోల్పోతున్నాం. -యువరాజ్ సింగ్
- మీరు ఆడే రోజుల్లో ఎన్నోసార్లు మాకు పట్టరాని సంతోషాల్ని ఇచ్చారు. వాటన్నిటికీ ధన్యవాదాలు. ఈ ఆటలో అత్యున్నత శిఖరాలకు చేరిన ఏకైక వ్యక్తి డీగో మారడోనా. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. -రవిశాస్త్రి