మణిపుర్.. ఈ పేరు చెప్పగానే మేరీకోమ్, బాంబేలాదేవి, మీరాబాయ్ చాను, లాల్‌రెమ్‌సియామి లాంటి వివిధ క్రీడల్లో మెరిసిన మహిళలు కనిపిస్తారు... అదే మణిపుర్ నుంచి వచ్చి ఎంతో నైపుణ్యం ఉండి గుర్తింపు రాక.. తెరవెనుకే మిగిలిపోయిందో మహిళ ఆమె పేరే ఓయినమ్ బెంబెం దేవి.. భారత మహిళల ఫుట్‌బాల్ మణిపూస.. తాజాగా కేంద్ర ప్రభుత్వం బెంబెందేవికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.
క్రికెట్ జ్వరంతో ఊగిపోయే మన దేశంలో మహిళల ఫుట్‌బాల్ జట్టు ఒకటుందనే విషయం చాలామందికి తెలియదు. ఇక ఈ జట్టులోని క్రీడాకారిణుల గురించి ఎలా తెలుస్తుంది. భారత్ మహిళల ఫుట్‌బాల్‌కు ఊపిరిలూది ఒక స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఒక మణిపురి అమ్మాయి సొంతం.. ఆమే బెంబెం దేవి. దూకుడుకు మారుపేరు కావడం వల్ల భారత ఫుట్‌బాల్ దుర్గ అని పిలుచుకునే బెంబెం.. 1988లో ఈ ఆటలోకి వచ్చింది. ఇంఫాల్‌లోని యునైటెడ్ పయినీర్స్ క్లబ్ తరఫున అబ్బాయిలతో కలిసి ఆడేది. వాళ్లతో కలిసి ఆడడం కోసం తన పేరును బొబో, అంకో అని మార్చుకుంది.
పేద కుటుంబంలో పుట్టిన బెంబెం.. ఈ ఆటలో ఎదగడానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. మణిపుర్‌లో పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చే వరకు ఆమె టోర్నీలకు వెళ్లడానికి చాలా కష్టపడింది. 1991లో మణిపుర్ అండర్-13 జట్టుకు ఎంపికైన బెంబెం..తన ప్రదర్శనతో అందరి దృష్టిలో పడింది. 1993 నుంచి మణిపుర్ జట్టులో రెగ్యులర్ సభ్యురాలిగా మారిన ఈ మిడ్‌ఫీల్డర్.. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిచిన మణిపుర్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించింది. 15 ఏళ్ల వయసులో ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌లో గ్వామ్‌పై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది బెంబెం.
1996 ఆసియా క్రీడల్లో జపాన్, ఉజ్బెకిస్థాన్ లాంటి బలమైన జట్లపై బెంబెం తన ఆటతో అందర్ని మెప్పించింది. ఆమె మైదానంలో మెరుపులా కదిలే తీరు..బంతిని అందుకుని ప్రత్యర్థి క్రీడాకారిణులను తప్పిస్తూ గోల్ చేసే విధానం అద్భుతంగా అనిపిస్తాయి. 2010లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన దక్షిణాసియా క్రీడల్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు బెంబెం కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇప్పటిదాకా 33 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 12 గోల్స్ చేసిన బెంబెంతో 2014లో మాల్దీవుల ఫుట్‌బాల్ క్లబ్ న్యూ రేడియంట్ ఒప్పందం చేసుకుంది.
2001, 2013లో అఖిల భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా నిలిచిన 39 ఏళ్ల బెంబెం..2017లో అర్జున అవార్డు అందుకుంది. ఇటీవలే ఫిఫా 'బి' లైసెన్స్ కోచింగ్ సర్టిఫికెట్ పొందిన ఆమె.. ఒకవైపు క్రీడాకారిణిగా కొనసాగుతూనే మరో వైపు అమ్మాయిలకు శిక్షణ ఇస్తోంది.
"మహిళలు ఫుట్‌బాల్‌కు వచ్చి ఏం సాధిస్తారనుకునే వాళ్లకు తాజా పద్మశ్రీ అవార్డు కనువిప్పు. ఈ అవార్డు మిగిలిన అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా. ఫుట్‌బాల్ ఆడి పద్మశ్రీ పురస్కారం సాధించిన చున్నీ గోస్వామి, పీకే బెనర్జీ, బైచుంగ్ భూటియా లాంటి వారి సరసన నిలవడం గర్వంగా అనిపిస్తోంది" - బెంబెం దేవి