కరోనాతో విధించిన లాక్‌డౌన్ వల్ల అన్నిరంగాలతో పాటు క్రీడాకారులకూ తీరిక సమయం దొరికింది. ఈ క్రమంలోనే వారు వివిధ వ్యాపకాలు చూసుకుంటున్నారు. కొంత మంది కుటుంబంతో సరదాగా గడుపుతుంటే, మరికొందరు నెట్టింట్లో అభిమానులతో ముచ్చట్లు పెడుతున్నారు. అయితే, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ గౌర్‌మాంగీ సింగ్ మాత్రం శారీరకంగా, మానసికంగా నూతనోత్సాహం పొందడానికి వ్యవసాయాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. ఆటకు సంబంధించిన కార్యకలాపాల నుంచి లభించిన ఈ విరామ సమయంలో ఇంఫాల్‌లోని తన సొంత స్థలంలో సోదరులతో కలిసి సేంద్రీయ సేద్యం చేస్తూ కూరగాయలు పండిస్తున్నాడు.
"మా ఇంటి నుంచి కొద్ది దూరంలో మాకు కొద్దిగా స్థలం ఉంది. గత రెండేళ్ల నుంచి అక్కడ కొన్ని కూరగాయలు పండిస్తున్నాం. ఈ లాక్‌డౌన్ వల్ల సమయం లభించడం వల్ల మా సోదరులతో కలిసి ఈ సారి మిరప, పసుపు, అల్లం, దోసకాయ, మొక్కజొన్న, గుమ్మడి, కాకరకాయ లాంటి విభిన్న రకాల పంటలను పెంచుతున్నాం. సేంద్రీయ పద్ధతుల్లో చేస్తున్న ఈ వ్యవసాయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. గార్డెన్‌లో పని చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. రోజూ కొన్ని గంటల పాటు అక్కడే గడుపుతున్నా. విత్తనాలు వేయడం దగ్గర నుంచి కూరగాయలు కోయడం వరకూ.. ఇలా అన్ని పనులు చేయడం మనసుకు ప్రశాంతతను చేకూరుస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతున్నందుకు సంతృప్తిగా ఉంది."
గౌర్‌మాంగీ సింగ్, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్
భవిష్యత్‌లో ఈ వ్యవసాయాన్ని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం హీరో సెకండ్ డివిజన్ లీగ్ జట్టు బెంగళూరు ఎఫ్‌సీకి ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు గౌర్‌మాంగీ. 2013లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతడు.. భారత్ తరఫున 71 మ్యాచ్‌లు ఆడాడు.
ఇదీ చూడండి:ఛెత్రి 15 ఏళ్ల కెరీర్లో చెరిగిపోని రికార్డులెన్నో !