భారత్ ఫుట్‌బాల్ సారథి సునీల్ ఛెత్రి.. తన అద్భత ప్రదర్శనతో కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. అంతర్జాతీయంగా ఎక్కువ గోల్స్ చేసిన వారిలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు ఫుట్‌బాల్‌లోకి వచ్చిన జూన్ 12తో 15 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఛెత్రి సహచర ఆటగాడు యుగెన్సన్ లింగ్డో, తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. అతడు దిగ్గజ ఫుటబాలర్ అయినప్పటికీ, మనస్తత్వం మాత్రం చిన్నపిల్లాడిదని చెప్పుకొచ్చాడు.
"నాకు సరిగ్గా తేదీ గుర్తులేదు. అయితే ఆరోజు బెంగుళూరులో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ పూర్తిచేసి, మేం ఉంటున్న చోటుకు ఛెత్రి, నేను త్వరగా వెళ్లిపోయాం. అదే రోజు 2017లో జరిగిన అండర్-17 ఫిపా ప్రపంచకప్‌లో కొలంబియాతో భారత్ తలపడింది. ఆ తర్వాత రోజు మా జట్టు మకావ్తో ఆడాలి. నేను ఛెత్రి కలిసి ప్రపంచకప్‌ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నాం. కానీ అతడు మాత్రం తానే స్వయంగా ఆడుతున్నట్లు ఫీల్ అవుతూ చూస్తున్నాడు. ఆ మ్యాచ్‌లో ఓ సందర్భంలో జీక్సింగ్ కొట్టిన అద్భుతమైన గోల్‌కు ఛెత్రి, అమాంతం చిన్నపిల్లవాడిలా మంచంపై నుంచి సంతోషంతో ఎగిరి గంతేశాడు. కేరింతలతో అటూఇటూ పరిగెత్తాడు. ఆ ఆనందంలో ఎదురుగా ఉన్న సహాయ సిబ్బంది గది తలుపు తట్టిన సునీల్, ఏమి తెలియనట్లు మా గదికి వచ్చేశాడు. అందుకే అతడి మనస్తత్వం చిన్నపిల్లాడిలాంటిదని అంటాను. ఇప్పటికీ, ఎప్పటికీ అలానే ఉంటాడు. అతడితో కలిసున్న ఎవరినీ ఎటువంటి ఇబ్బంది పెట్టాడు. అందరితో బాగా కలిసిపోతాడు. ప్రపంచంలో ఉన్న విద్యా, వైద్య, రాజకీయాలు, వ్యక్తిగత విషయాలు సహ ఇంకా అనేక అంశాల్ని చర్చిస్తాడు. కానీ ఎవరిపై విమర్శలు చేయడు"
-యుగెన్సన్ లింగ్డో, భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు.
2017లో ఫిఫా ప్రపంచకప్‌లో కొలంబియా జట్టుపై 1-2 తేడాతో భారత్ ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్‌లో జీక్సింగ్ కొట్టిన గోల్ మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇది చూడండి : టీ20 ప్రపంచకప్ నిర్వహణపై జులైలో తుది నిర్ణయం