మరణానికి ముందు సాకర్ దిగ్గజం మారడోనాకు సరైన వైద్యం అందలేదని ఓ వైద్య నివేదిక తేల్చింది. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చి ఉంటే ఆయన బతికే వాడని కూడా చెప్పింది. ఈ మేరకు మారడోనా మృతిపై దర్యాప్తు చేస్తున్న విచారణాధికారులకు నివేదిక అందింది. మారడోనా కోసం పనిచేసిన బ్రెయిన్ సర్జన్ లియోపోల్డో లుకె, సైకియాట్రిస్ట్ కొసచోవ్ సహా విచారణ ఎదర్కొంటున్న ఏడు మందికి ఇది ఇబ్బంది కలిగించే అంశమే. దాదాపు రెండు నెలల పాటు పని చేసిన 20 మంది వైద్యులు ఈ నివేదికను తయారు చేశారు. 60 ఏళ్ల మారడోనా నిరుడు తన అద్దె ఇంటిలో గుండెపోటుతో మృతి చెందాడు. అంతకుముందు అతడి మెదడుకు శస్త్రచికిత్స జరిగింది.
"రోగి ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు సూచనలు కనిపించినా పట్టించుకోలేదు. తగిన చికిత్స లభించలేదు. దాదాపు 12 గంటల పాటు మారడోనా ఎంతో వేదనను అనుభవించాడు. అతడు చికిత్స పొందిన ఇంట్లో.. అత్యవసరంగా చికిత్స పొందడానికి అవసరమైన కనీస సదుపాయాలు లేవు. సకాలంలో ఆస్పత్రిలో చేర్చి ఉంటే అతడు చనిపోయేవాడు కాదు" అని నివేదికలో వైద్యబృందం పేర్కొంది.
ఇదీ చదవండి: అందుకే ఐపీఎల్ వాయిదా వేశాం: లీగ్ ఛైర్మన్