భారత యువ కెరటం ముంబయి క్రికెటర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. గత కొద్ది కాలం నుంచి సంచలనాలు నమోదు చేస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్న అతడు.. టీమ్ఇండియా స్థానం దక్కించుకునేందుకు దూసుకొస్తున్నాడు. తాజాగా దేశవాలీ టోర్నీ ఇరానీ కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన అతడు.. అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ (259 బంతుల్లో 213; 30x4, 3x6), సెంచరీతో (132 బంతుల్లో 121*; 15x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
- ఈ ద్విశతకం, శతకం సాధించడం వల్ల పలు రికార్డులను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు అధిగమించాడు. ఇరానీ కప్‌లో ఒకే మ్యాచ్‌లో ఈ డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.
- అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ మార్క్‌ను అందుకున్న ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు.
- సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్ తర్వాత ఇరానీ కప్ మ్యాచ్‌లో 300కు పైగా రన్స్ చేసి పరుగులు చేసిన సెకండ్ బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే ఒకే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ద్విశతకం, శతకం నమోదు చేసిన 11వ భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు.
- ఈ దేశవాలీ సీజన్‌లో కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఇంత తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్న మూడో బ్యాటర్‌గా నిలిచాడు.
- ఇకపోతే 21 ఏళ్ల యశస్వికి అరంగేట్రం మ్యాచ్‌లోనే ద్విశతకం బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్‌లోనూ ఇలానే డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ఆడిన అతడు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 227 రన్స్ సాధించాడు.
- అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ అతడు శతకంతో విజృంభించాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు 146 రన్స్ చేశాడు.
ఇకపోతే ఇరానీ కప్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ పోరులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి(213) ద్విశతకంతో విజృంభించగా.. అభిమన్యు ఈశ్వరన్(154) శతకంతో అదరగొట్టాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4, అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్ కుష్వా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన మధ్యప్రదేశ్‌లో 294 పరుగులు చేసింది. యశ్ దూబే (109) శతకంతో ఆకట్టుకోగా, హర్ష గవ్లీ (54), సరాన్ష్ జైన్ (66) హాఫ్ సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆప్ ఇండియా బౌలర్లలో పుల్కిత్ నారంగ్ (4/65), నవ్‌దీప్ సైనీ (3/56), ముకేశ్ కుమార్ (2/44), సౌరభ్ కుమార్ (1/74)తో ఆకట్టుకున్నారు.
అలా తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియా నాలుగో రోజు భోజన విరామ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. మొత్తంగా 391 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. యశస్వి (121*) క్రీజులో కొనసాగుతున్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అంకిత్ ఖుష్వా తలో 2 వికెట్లు, కుమార్ కార్తీకేయ, సరాన్ష్ జైన్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చూడండి : WPL 2023: తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్