భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final) సందర్భంగా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌కు తోడుగా టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానం చేయబోతున్నాడు. సౌథాంప్టన్‌లో ఈనెల 18న ఆరంభమయ్యే ఈ చరిత్రాత్మక పోరులో వ్యాఖ్యాన బృందంలో భారత్ నుంచి సన్నీ, డీకేలకే చోటు దక్కింది.
"నేను భారత క్రికెట్ జట్టుకు సలహాదారుగా ఉన్న సమయంలో కార్తీక్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో నాతో కలిసి వ్యాఖ్యానం చెప్పబోతున్నాడు. కామెంట్రీ బాక్స్‌లోనూ డీకే రాణిస్తాడని అనుకుంటున్నా. అతడికి నా అభినందనలు" అని సన్నీ పేర్కొన్నాడు. కార్తీక్ కలిసి ఉన్న ఫొటోను కూడా సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
"మీతో కలిసి కామెంట్రీ బాక్స్‌ను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అభినందనలకు కృతజ్ఞతలు'' అంటూ డీకే బదులిచ్చాడు. ప్రస్తుతం గావస్కర్‌తో కలిసి కార్తీక్ సెర్బియాలో క్వారంటైన్లో ఉన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆరంభానికి ముందు వీళ్లిద్దరూ ఇంగ్లాండ్ బయల్దేరనున్నారు. ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో భారత్ ఆడిన సిరీస్‌లో కార్తీక్ వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశాడు.
ఇదీ చదవండి: 'నేటి మేటి టెస్టు బౌలర్లలో అశ్విన్ ఒకడు'