ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC final) కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మొదటి రోజే నిరాశ ఎదురైంది. సౌథాంప్టన్‌లో శుక్రవారం భారీ వర్షం కురవడం వల్ల తొలిరోజు అసలు బంతే పడలేదు. వరుణుడు ప్రభావం తగ్గకపోవడం వల్ల మొదటిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకంటించారు అంపైర్లు. రెండో రోజైనా మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానంలో ఫ్యాన్స్ ఉన్నారు. వారికి కొంత ఊరట కలిగించే అంశం ఇది.
రెండో రోజు వాతావరణం
సౌథాంప్టన్‌లో శనివారం భారీ వర్షం కురిసే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు కాస్త పొడిగా ఉంటుందని తెలిపారు. రెండు, మూడు సార్లు చిరుజల్లులు కురిసే అవకాశం మాత్రం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ఇదే జరిగితే రెండో రోజు ఆట జరిగే వీలుంటుంది.
రిజర్వ్ డేపై సందిగ్ధత!
వర్షం వల్ల మొదటి రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడలేదు. అయితేనేం రిజర్వ్ డే ఉందిగా అని అభిమానులతో పాటు పలువురు అభిప్రాయపడుతుండొచ్చు. కానీ, వృథా అయిన మొత్తం రోజుకు రిజర్వ్ డేను కేటాయించరు. కేవలం ఫలితం వస్తుందనుకున్న సందర్భంలో లేదా రోజువారీగా ఎన్ని ఓవర్లు తక్కువగా వేశారో అంత మేరకు ఆట సాగడానికి ఈ అదనపు రోజును వాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ అదనపు రోజు అనేది పూర్తి ఐదు రోజులకు సంబంధించింది. అది కూడా నిర్వాహకులు అవసరమని భావిస్తేనే అది అమల్లోకి వస్తుంది. లేదంటే మ్యాచ్‌ను డ్రా లేదా టైగా ప్రకటించే అవకాశం ఉంటుంది.