టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(Rishabh Pant) మరింత మెరుగయ్యాడని మాజీ క్రికెటర్ కిరణ్ మోరె(Kiran More) అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు అతడు మళ్లీ కీలకమవుతాడని పేర్కొన్నారు. బ్యాటింగే కాకుండా కీపింగ్‌లోనూ పరిణతి కనబరుస్తున్నాడని ప్రశంసించారు.
"ఇంగ్లాండ్ సిరీస్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రిషభ్ పంత్ మరోసారి కీలకమవుతాడు. ప్రస్తుతం అతడు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పుడైనా, ఏ స్థానంలోనైనా ఆటను మలుపు తిప్పగలనన్న ఆత్మవిశ్వాసం అతడిలో కనిపిస్తోంది. వికెట్ల వెనకాల సైతం పంత్ అతడనిప్పుడు చక్కగా కుదురుకున్నట్టు అనిపిస్తోంది. పంత్ ఇంగ్లాండ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 2019 వన్డే ప్రపంచకప్‌ను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం మూడోది. అక్కడి పరిస్థితులు అతడికి బాగా తెలుసు. ఇంగ్లాండ్‌లో అతడు టెస్టు శతకం నమోదు చేశాడు. గ్లోవ్స్‌తోనూ అతడు మాయాజాలం చేయగలడు"
-కిరణ్ మోరే, మాజీ చీఫ్ సెలెక్టర్.
కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసంతో రిషభ్ పంత్ కనిపిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్టుల్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా ముందుకు నడిపించాడు. సారథిగా విజయాలు అందించాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాలో ఏకంగా సిరీస్ విజయాన్నే అంందించి చరిత్ర సృష్టించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల్లో అతడు రాణించాలని టీమ్‌ఇండియా కోరుకుంటోంది.
ఇదీ చదవండి: WTC: 13ఏళ్ల కిందట సెమీస్‌లో.. ఇప్పుడు ఫైనల్లో..