సౌథాంప్టన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడుతూనే ఉన్నాడు. నాలుగో రోజు మ్యాచ్‌లో ఒక్క బంతి పడకుండానే తొలి సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఇరు జట్ల ఆటగాళ్లు లంచ్ బ్రేక్ తీసుకున్నారు.
సౌథాంప్టన్‌లో పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. వర్షం తగ్గుతూనే మళ్లీ పెరుగుతోంది. తగ్గిన ప్రతిసారీ.. పిచ్‌ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అటు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్(0*), విలియమ్సన్(12*) ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు కోహ్లీసేన 217 పరుగులకు ఆలౌటైంది.
అంతకు ముందు వర్షం కారణంగా తొలి రోజు కనీసం ఒక్క బంతి పడకుండానే ఆట రద్దయింది. వెలుతురులేమీ కారణంగా తర్వాతి రెండు రోజులు ఆట పూర్తిగా జరగలేదు. వరుణుడు ఇలాగే అడ్డుపడితే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.
మరోవైపు సామాజిక మాధ్యమాల వేదికగా క్రికెట్ అభిమానులు, నెటిజెన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులు, ఐసీసీపై మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: WTC Final: క్రికెట్ స్టేడియంలో సినిమా గోల