WTC Final 2023 Team India : ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 209 పరుగుల తేడాతో ఘోర పరాభవం మూటగట్టుకుంది టీమ్ఇండియా. అన్ని విభాగాల్లో విఫలమై వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ గదను చేజార్చుకుంది. ఈ ఓటమిపై భారత జట్టు సారథి రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మేరకు మాట్లాడుతూ.."టాస్ గెలిచి అలాంటి పిచ్‌పై ఆస్ట్రేలియా జట్టును బ్యాటింగ్‌కు దించి.. మ్యాచ్‌ను బాగానే ప్రారంభించామని అనుకున్నాం. తొలి సెషన్‌లో మేం బాగా బౌలింగ్ చేశాం. ఆ తర్వాత మా ప్రదర్శన తగ్గింది. ఆస్ట్రేలియా బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాలి. స్మిత్‌తో కలిసి హెడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అదే మమ్మల్ని గెలవకుండా చేసింది. మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవడం ఎంత కష్టమో తెలుసు. కానీ.. మేము మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చామని అనుకుంటున్నాను. చివరి వరకు పోరాడాం".
"గత నాలుగేళ్లుగా కష్టపడి పనిచేశాం. నిజం చెప్పాలంటే.. రెండు ఫైనల్స్ ఆడడం.. గొప్ప విజయంగా భావించాలి. రెండేళ్లుగా మేము పడిన కష్టాన్ని.. ఈ ఓటమితో తీసిపారేయలేం. ఇది టీమ్ గొప్ప ప్రయత్నం. దురదృష్టవశాత్తు.. ఫైనల్‌లో విజయం సాధించలేకపోయాం. కానీ.. మా పోరాటం మాత్రం కొనసాగుతుంది. ఇక అభిమానుల సపోర్ట్ మరువలేనిది. అందరికీ నా కృతజ్ఞతలు" అని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పాడు.
'ఒక మ్యాచ్ కాదు.. 3 మ్యాచ్‌ల సిరీస్ ఉండాలి'
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఒక మ్యాచ్ ఉండటం కరెక్ట్ కాదని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. "నేను WTC ఫైనల్ కోసం 3-టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ని ఆడాలనుకుంటున్నాను. మేము చాలా కష్టపడ్డాము, పోరాడాము. కానీ మేము కేవలం ఒక మ్యాచ్ ఆడాము. తదుపరి WTC సైకిల్‌లో.. 3 మ్యాచ్‌ల సిరీస్ బాగుంటుందని నేను భావిస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ చెప్పాడు.
వారిది అద్భుతమైన భాగస్వామ్యం..
WTC Final 2023 Winner : 'టాస్ ఓడిపోయాం.. కానీ ట్రావిస్ హెడ్, స్మిత్‌ల అద్భుత భాగస్వామ్యం.. మాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించింది. గతంలో యాషెస్‌తో మొదలైన హెడ్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది. బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. తొలిరోజు మంచి ఆధిక్యాన్ని ప్రదర్శించాం. ఆ తర్వాత దాన్ని కొనసాగించాం. మధ్యలో భారత్ పుంజుకున్నప్పటికీ ఆట మా ఆధీనంలోనే ఉంది. బోలాండ్ నాకు ఇష్టమైన ఆటగాడు. అందరూ బాగా ఆడారు. ఇది మాకు ఇష్టమైన ఫార్మాట్. మేం టెస్ట్ క్రికెట్ చూస్తూ పెరిగాం. ఇది మిమ్మల్ని సవాలు చేస్తుంది. ఇందులో గెలిస్తే గొప్ప సంతృప్తి కలుగుతుంది' అని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు.