World Cup 2023 Final : వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను మట్టి కరిపించిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లడంతో క్రికెట్ అభిమానుల ఆనందం కొత్తపుంతలు తొక్కుతోంది. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ తుది పోరును చూసేందుకు క్రికెట్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్ భారీగా అహ్మదాబాద్‌కు పోటెత్తుతున్నారు. అయితే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటన వెలువడిన నాటి నుంచే ఇక్కడి హోటల్ గదుల ధరలు తారస్థాయిలో పెరగ్గా.. ఇప్పుడు టీమ్‌ఇండియా ఫైనల్స్‌కు చేరడం వల్ల ఈ టారిఫ్‌లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సగటు అభిమానికి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
World Cup 2023 Final Venue : సాధారణంగా అహ్మదాబాద్‌లోని బేసిక్ హోటల్ రూమ్ ధర.. ఒక్క రాత్రికి సుమారు రూ. 10వేల రూపాయలుగా ఉండగా.. ఇక, ఫోర్, ఫైవ్ స్టార్ హోటళ్ల ధరలు మాత్రం మామూలుగా లేవు. ఒక్క గదిని అద్దెకు తీసుకోవాలంటే ఒక రాత్రికి దాదాపు రూ.లక్ష రూపాయల వరకు చెల్లించాల్సిందే. ఇంకొన్ని లగ్జరీ హోటళ్ల యాజమాన్యాలు అయితే ఒక్కో గదికి రూ. 24 వేల నుంచి ఏకంగా రూ. 2 లక్షల 15 వేల మేరకు ఛార్జ్ చేస్తున్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియాలు పలు కథనాల్లో వెల్లడించాయి. అయితే అక్టోబరు 15న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలోనూ అహ్మదాబాద్‌లోని హోటల్ ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు వాటికంటే రెట్టింపుగా పెరగడం గమనార్హం.
India Vs Australia World Cup Final : మరోవైపు భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ నేపథ్యంలో హోటల్స్‌తో పాటు అహ్మదాబాద్‌కు విమాన టికెట్ ధరలు కూడా సగటు ప్రయాణికుడిని బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని ఎయిర్‌లైన్లలో టికెట్ ధరలు సుమారు 200 నుంచి 300 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఫైనల్ మ్యాచ్ కోసం నవంబరు 13న తుది దశ టిక్కెట్లు విక్రయాలు చేపట్టగా.. అవన్నీ క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాదే విజయం - ఎనిమిదోసారి ఫైనల్స్‌కు ఆసీస్