World Cup 2023 : భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023లో తమ జట్టు ఎక్కడైనా.. ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వెల్లడించాడు. అయితే భారత్‌లోని కొన్ని స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడేందుకు పాక్.. ముందుగా అంగీకకరించలేదని, ఆ వేదికలను మార్చాలని డిమాండ్ చేసినట్లు కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చాయి. పాక్ భారత్‌లో ఆడే వేదికల మీద సందిగ్ధత నెలకొన్న తరుణంలో.. ఆ జట్టు కెప్టెన్ తాజా ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు.. ఆ దేశ ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
"మేము ప్రపంచకప్ ఆడేందుకు వెళ్తున్నాం. అంతేకానీ ఒక్క భారత్‌తోనే ఆడేందుకు కాదు. మా దృష్టి కేవలం భారత్‌తో మ్యాచ్ మీదే కాకుండా.. టోర్నీలో పాల్గొనే మిగతా జట్ల పైన కూడా ఉంటుంది. కేవలం భారత్‌పై గెలిస్తే మేము ఫైనల్‌కు చేరలేం కదా. అందుకే మేము అన్ని జట్ల పైనా సమష్టి కృషితో మంచి ప్రదర్శనతో రాణించి.. అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుస్తాము. ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా వెళ్లి.. అక్కడ ఆడతాము. ఎక్కడైనా మా సత్తా చాటుతాము. రాబోయే వారంలో శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాము. కొంత విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పటి నుంచే వరల్డ్ కప్ టోర్నీకి సిద్ధమవుతాము. శ్రీలంక పర్యటన తర్వాత ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ వల్ల మినీ టోర్నీలో అనుభవం కలిసొస్తుంది"
- బాబర్ అజామ్, పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్.
ICC T20 World Cup 2016 : కాగా పాకిస్థాన్ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో ఆడింది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. వన్డే మ్యాచ్‌లో భారత్ - పాక్ చివరిసారిగా వరల్డ్ కప్ 2019లో తలపడ్డాయి. నాలుగేళ్ల నుంచి వన్డేల్లో దాయాదుల పోరు చూడని ఇరు దేశాల అభిమానులు.. రానున్న ప్రపంచకప్‌లో వీరి మ్యాచ్ కోసం తహతహలాడుతున్నారు.
World Cup 2023 Ind vs Pak : భారత్ - పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇప్పటి నుంచే బీభత్సమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మ్యాచ్ జరిగే వారంలో.. అహ్మదాబాద్ సహా, సమీప నగరాల్లో లగ్జరీ హోటల్స్ రేట్లు పెంచేశాయి. కొన్ని హోటల్స్‌లో ఒక రోజు బస చేసేందుకు సుమారు రూ. 80 వేల ఖర్చు చేయాల్సి వస్తుంది. పాక్ ప్రపంచ కప్‌లో తమ మిగతా మ్యాచ్‌లను కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఆడనుంది.