భారత్‌కు తొలి అండర్-19 వరల్డ్ కప్‌ను అందించిన అమ్మాయిలకు అభిమానులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్‌తో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వరల్డ్‌కప్ విజేతలను పూలమాలలతో సత్కరించారు. బ్యాండు మేళాలతో అదిరిపోయే వెల్కమ్ చెప్పారు. అభిమానులు జాతీయ జెండాలతో నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ప్లేయర్లు కూడా కుటుంబ సభ్యులతో కలిసి చిందులేశారు. అనంతరం ఆటగాళ్లను ఊరేగించారు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కొద్ది సేపు కోలాహలంగా మారింది.
"సచిన్ తెందుల్కర్‌తో మాట్లాడటం చాలా గొప్పగా అనిపించింది. మా కల నెరవేరింది. మొదటి సారి అండర్-19 వరల్డ్‌కప్ గెలవడం మాకు చాలా పెద్ద విషయం. ఇప్పుడు జట్టు మొత్తం ఆనందంగా ఉంది. మేము మహిళా వరల్డ్‌కప్ కోసం ఎందురు చూస్తున్నాం."
-- అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు
కాగా, ఈ వరల్డ్‌కప్ విజేతలను ఇంతకుముందు బీసీసీఐ సత్కరించింది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శ జై షా, టీమ్ఇండియా మాజీ దిగ్గజం సచిన్ తెందుల్కర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పాల్గొన్నారు. వరల్డ్ కప్ గెలిచిన టీమ్, సపోర్ట్ స్టాఫ్‌కు బీసీసీఐ ప్రకటించిన రూ. 5 కోట్ల ప్రైజ్‌మనీని కెప్టెన్ శెఫాలీ వర్మ అందుకుంది. ఈ సందర్భంగా సచిన్ తెందుల్కర్ మాట్లాడుతూ.. "ఈ ప్రపంచకప్ గెలవడం ద్వారా, మీరు భారతదేశంలోని అమ్మాయిలకు, దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కోరికను కలిగించారు. మహిళల ఐపీఎల్ ప్రారంభం కావడం చాలా పెద్ద విషయం. క్రీడల్లోనే కాకుండా.. పురుషులు, మహిళల సమానత్వాన్ని నేను కోరుకుంటాను. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉండాలి" అని సచిన్ తెందుల్కర్ అన్నారు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత అమ్మాయిలు ఘన విజయం సాధించారు. ఇంగ్లాడ్ నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో ఛేదించి.. టీమ్ఇండియా తొలి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అనంతరం బరిలోకి దిగిన టీమ్ఇండియా బ్యాటర్లు గొంగడి త్రిష, సౌమ్య తివారీ అద్భుతంగా ఆడి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. భారత జట్టును విజయ తీరాలకు నడిపించారు.