టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇకపై వన్డే, టెస్టు కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తానని వెల్లడించాడు. పని భారం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా, ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో కోహ్లీ ఒకడని చెప్పడంలో సందేహం లేదు. అయితే టీ20ల్లో ఇప్పటివరకు అత్యుత్తమ కెప్టెన్ ఎవరో తెలుసా?
ఈ లిస్టులో అఫ్గానిస్థాన్ సారథి అస్ఘర్ అఫ్గాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతడు ఆ జట్టుకు 52 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 42 విజయాలు అందించాడు. తర్వాత టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ 72 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇందులో 41 విజయాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆ జట్టును 37 (64 మ్యాచ్‌లు) సార్లు గెలిపించాడు.
ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే 45 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఇతడు 27 మ్యాచ్‌ల్లో విజయాలనందించాడు. ఇతడి హయాంలో 14సార్లు ఓటమి పాలైంది జట్టు. రెండు మ్యాచ్‌లు డ్రా కాగా, మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. మొత్తంగా విజయ శాతం 65.11గా ఉంది. అయితే టీ20ల్లో కెప్టెన్‌గా అర్ధసెంచరీల విషయంలో మాత్రం కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ పేరిట 12 హాఫ్ సెంచరీలు ఉండగా, బాబర్ అజామ్ (11), అరోన్ ఫించ్ (11), కేన్ విలియమ్సన్ (11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.