టీమ్ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానెపై అనవసరంగా ఒత్తిడి పెంచొద్దని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ అతడు నిలబడతాడని పేర్కొన్నారు. ప్రతి మ్యాచులోనూ పరుగులు చేయాలన్న అనవసర భారం అతడిపై మోపొద్దని సూచించారు.
"అజింక్యా రహానె మంచి ఆటగాడు. అతడు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కానీ జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ అతడు అండగా నిలబడ్డాడు. అతడికా సత్తా ఉంది. అతడు కొన్నిసార్లు పరుగులు చేయకపోవచ్చు. అందుకని జట్టు కఠిన నిర్ణయం తీసుకుంటుందని అనుకోను. జింక్స్ ఘనంగా పుంజుకుంటాడు. అతడు జట్టు మనిషి. అందరూ అతడిని ఇష్టపడతారు. విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడని ప్రతిసారీ అజింక్య ముందుకొస్తాడు. సీనియర్లు లేకున్నా ఆస్ట్రేలియాలో సారథిగా, ఆటగాడిగా అతడెలా రాణించాడో మనం మర్చిపోవద్దు. అతనెప్పుడో తనను తాను నిరూపించుకున్నాడు. మిగతా భారత ఆటగాళ్ల కన్నా విదేశాల్లో అతడి రికార్డులు ఎంతో బాగున్నాయి. సొంతగడ్డపైనే అతడు కాస్త ఇబ్బంది పడ్డాడేమో. అందుకే అతడిపై అవసరమైన ఒత్తిడి చేయొద్దు"
-ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ చీఫ్ సెలెక్టర్.
ప్రస్తుతం రహానె ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సిద్ధమవుతున్నాడు. ఛాంపియన్‌షిప్‌లో అతడు 17 మ్యాచులాడి 3 శతకాలతో 1095 పరుగులు చేశాడు. భారీ స్కోర్లు చేసేందుకు ఇబ్బంది పడ్డప్పటికీ అతడు జట్టుకు విజయాలే అందించాడు. ఆసీస్‌లో అతడి ప్రదర్శనలను ఎంత మెచ్చుకున్నా తక్కువే!
ఇదీ చదవండి: WTC Final: 'కివీస్‌తో పోరులో వాళ్లిద్దరే కీలకం'