దులీప్ ట్రోఫీ-(2003-04) ఫైనల్లో ఈస్ట్‌జోన్ తరఫున ఎంఎస్ ధోనీ(MS Dhoni)తో వికెట్ కీపింగ్ చేయించేందుకు సౌరవ్ గంగూలీని ఒప్పించాల్సి వచ్చిందని బీసీసీఐ మాజీ సెలక్టర్ కిరణ్ మోరె(Kiran More) అన్నారు. దీప్‌దాస్ గుప్తా వికెట్ కీపింగ్ చేయకుండా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఫైనల్లో ఆకట్టుకున్న మహీ ఆ తర్వాత భారత్-ఏ తరఫున పరుగుల వరద పారించాడని తెలిపారు. ఆపై టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడని తెలిపారు.
"అప్పుడు మేం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోసం చూస్తున్నాం. మొదట నా సహచరుల ద్వారా ధోనీ గురించి విన్నాను. అతడి ఆటను చూసేందుకు వెళ్లాను. జట్టు స్కోరు 170 అయితే అతడే 130 పరుగులు చేయడం వీక్షించాను. అతడు బౌలర్లందరినీ చితకబాదేశాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున అతడిని వికెట్ కీపింగ్ చేయించాలనుకున్నాం. సౌరవ్ గంగూలీ, దీప్‌దాస్ గుప్తాతో తీవ్రంగా చర్చించాం. వారిద్దరూ కోల్‌కతాకు చెందినవారు. టీమ్‌ఇండియాకు ఆడుతున్నారు. దీప్‌దాస్‌ను కీపింగ్ చేయకుండా ఆపేందుకు, గంగూలీని ఒప్పించేందుకు సెలక్టర్లకు కనీసం పది రోజులు పట్టింది."
- కిరణ్ మోరె, టీమ్ఇండియా మాజీ సెలెక్టర్
"ధోనీ ఫైనల్లోని తొలి ఇన్నింగ్స్‌లో 21, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అతడి పవర్ గేమ్‌ను మేం చూశాం. ఆ తర్వాత భారత్-ఏ, పాక్-ఏ, కెన్యా ముక్కోణపు సిరీసులో అతడు దాదాపుగా 600 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ధోనీలో మాకు మ్యాచ్ విజేత కనిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అతడిని తెరపైకి తీసుకురావడంలో మా అందరి కృషి ఉంది" అని మోరె వెల్లడించారు.
మహీ అరంగేట్రానికి ముందు రాహుల్ ద్రవిడ్ టీమ్‌ఇండియాకు కీపింగ్ చేస్తున్నాడు. 2003 ప్రపంచకప్(2003 world cup)లోనూ ఆ స్థానంలో ద్రవిడ్ కొనసాగాడు. అతడిపై పనిభారం పెరగడం, లోయర్ ఆర్డర్లో మెరుపు బ్యాటింగ్ చేసే కీపర్ కోసం సెలక్టర్లు చూస్తున్నారు. అదే సమయంలో ధోనీ గురించి కిరణ్ మోరె తన మిత్రుల ద్వారా వినడం గమనార్హం.
ఇదీ చూడండి: Virat Kohli: ఎగిటేరియన్ ట్రోల్స్‌పై కోహ్లీ స్పందన!