స్లెడ్జింగ్ చేసేందుకు ఇంగ్లాండ్ క్రికెటర్లు ముందుంటారు. ఇక ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్(Andrew Flintoff) గురించి ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో కథలు ఉన్నాయి. ముఖ్యంగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly)తో ఫ్లింటాఫ్ గొడవ తెలిసిందే! అలాంటి మరో సంఘటన ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. ఓ మ్యాచ్‌లో దాదాను స్లెడ్జ్ చేయడం కోసం.. అప్పటివరకు బాత్రూమ్లో ఉన్న ఫ్లింటాఫ్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడంట!
2002 జులైలో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది టీమ్ఇండియా. ఈ టూర్లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో జరిగిందీ ఘటన. తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసిన సౌరభ్.. రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. అదీ అరంగేట్ర బౌలర్ హార్మిసన్(Harmison) బౌలింగ్‌లో.
కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. సౌరభ్ ఔట్ అయ్యే సమయానికి.. ఫ్లింటాఫ్ ఫీల్డ్ నుంచి బ్రేక్ తీసుకుని బాత్రూమ్కు వెళ్లాడు. దాదా ఔటయ్యాడు అని తెలిసేసరికి.. పరిగెత్తుకుంటూ మైదానం దగ్గరికి వచ్చాడు. దాదా పెవిలియన్‌కు వెళుతుండగా ఎదురుపడి స్లెడ్జింగ్‌కు దిగాడు. దాదా గురించి తెలిసిందే! ఏమాత్రం తగ్గని గంగూలీ.. అతనికి దీటుగా బదులిచ్చాడు.
తాజాగా ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ హర్మిసన్ తెలిపాడు.
హద్దుమీరిన ఫ్లింటాఫ్..
ఫ్లింటాఫ్- గంగూలీ మధ్య మొదటి నుంచే కనపడని వైరం ఉండేది. కవ్వింపులు ఫ్లింటాఫ్‌కు అలవాటే అయినప్పటికీ.. గంగూలీ తానంతట తాను వివాదాల జోలికి వెళ్లడు.
ఈ 'బాత్రూమ్' సంఘటనకు ముందే.. అంటే 2002 జులైలో ఫ్లింటాఫ్ హద్దుమీరి ప్రవర్తించిన సంగతి తెలిసిందే. 2002 జనవరిలో ఆరు వన్డేల సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్. సిరీస్‌లో చివరి వన్డే వాంఖడేలో జరిగింది. అప్పటికే 3-2 ఆధిక్యంలో ఉన్న భారత్‌కు ముంబయి మ్యాచ్‌లో భంగపాటు ఎదురైంది. సిరీస్ 3-3తో సమమైంది. విజయానందాన్ని ఆపుకోలేని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్.. షర్ట్ విప్పి గ్రౌండ్ మొత్తం తిరిగాడు.
దాదా ప్రతీకారం..
ఫ్లింటాఫ్ షర్ట్ విప్పి తిరిగిన సంఘటనను దాదా తీవ్రంగానే పరిగణించాడు. ఆ తర్వాత నాట్‌వెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లింది గంగూలీ సేన. ఫైన్ల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై రెండు వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ అయిపోయిన కొద్ది క్షణాల తర్వాత.. పెవిలియన్‌లో షర్ట్ విప్పి గిరగిర తిప్పుతూ కనపడ్డాడు గంగూలీ. ఇది భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రగా మిగిలిపోయింది.
యువీతోనూ..
ఇలా.. స్లెడ్జింగ్‌కు వెళ్లడం.. భంగపాటుకు గురవడం ఫ్లింటాఫ్‌కు అలవాటుగా మారింది. టీమ్ఇండియా విషయంలో ఇది ఇంకా ఎక్కువే! 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా యువరాజ్ (Yuvraj Singh)తోనూ గొడవకు దిగాడు. రెచ్చిపోయిన యువీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు(Six Sixes) కొట్టి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నోరు ముయించాడు.
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్: భారత్- పాక్ 'మ్యాచ్' ఫిక్స్- ఫ్యాన్స్ ఖుష్