surya kumar yadav sixes third T20: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్(65).. 31 బంతుల్లో ఓ ఫోరు, ఏడు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. అయితే డ్రేక్స్ బౌలింగ్‌లో అతడు ఆడిన ఓ సిక్సర్ అయితే సంచలనమనే చెప్పొచ్చు. ఆఫ్ సైడ్ పడిన బంతిని చాలా ఆలస్యంగా అందుకుంటూ.. బ్యాట్‌ను వికెట్లకు దూరంగా పరిచినట్లు కొట్టిన ఆ షాట్‌కు బంతి వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఈ అద్భుతమైన షాట్‌కు ప్రత్యర్థి కెప్టెన్ పొలార్డ్ కూడా చప్పట్లతో అభినందించాడంటేనే ఆ సిక్సర్ ఎలా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఇదొక్కటే కాదు షెపర్డ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతికి మరో నమ్మశక్యం కాని సిక్సర్‌ను కూడా బాదాడు. బంతిని ఏదో చటుక్కున పక్కకు లాగేసినట్లు కొట్టిన షాట్‌కు బంతి స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. టీమ్‌ఇండియా 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో వెంకటేశ్ అయ్యర్‌తో(35) కలిసి సూర్యకుమార్.. 37 బంతుల్లో 91 పరుగులు సాధించాడు.
ఆల్‌రౌండర్ దొరికినట్లే
ధోని రిటైరయ్యాక ఇన్నింగ్స్‌కు మంచి ముగింపునిచ్చే, ఒత్తిడిలో నిలబడి లక్ష్య ఛేదనకు తోడ్పడే ఆటగాడి కోసం చూస్తోంది టీమ్‌ఇండియా. హార్దిక్ పాండ్య సహా చాలామందిపై ఆశలు పెట్టుకుంది ఎవరూ ‘ఫినిషర్’ పాత్రను సమర్థంగా నిర్వర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు వెంకటేశ్ అయ్యర్ ఈ దిశగా ఆశలు రేకెత్తిస్తున్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ వెంకటేశ్ కెరీర్‌కు మలుపే. ఈ సిరీస్‌కు ముందు 2 వన్డేల్లో 24, 3 టీ20ల్లో 36 పరుగులే చేశాడతను. పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. అయితే ప్రస్తుత సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ అతను బ్యాటుతో అదరగొట్టాడు. 13 బంతుల్లో 24 నాటౌట్, 18 బంతుల్లో 33, 19 బంతుల్లో 35 నాటౌట్.. ఇవీ మూడు మ్యాచ్‌ల్లో అతడి స్కోర్లు. చివరి ఓవర్లలో అతను మెరుపులు మెరిపిస్తూ ఫినిషర్ పాత్రను సమర్థంగా నిర్వర్తించాడు. ఆఖరి టీ20లో దీపక్ చాహర్ గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకుంటే బంతి అందుకుని 2.1 ఓవర్లు వేసిన వెంకీ.. 2 కీలక వికెట్లు పడగొట్టి ‘ఆల్‌రౌండర్’ అనిపించుకున్నాడు. వెంకటేశ్ ఇదే ఊపును కొనసాగిస్తే భారత్ కోరుకుంటున్న ఫినిషర్, ఆల్‌రౌండర్ దొరికినట్లే!
ఇదీ చూడండి: Saurabh Kumar: టీమ్‌ఇండియా వయా వైమానిక దళం