West Indies World Cup Qualifier : భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ 2023కు.. రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేకపోయింది. 48 ఏళ్ల ఈ మెగా టోర్నీ చరిత్రలో మొదటి సారి టాప్ 10 టీమ్‌లలో స్థానం సంపాదించలేకపోయింది. వరల్డ్ కప్‌నకు అర్హత సాధించడానికి జరుగుతున్న క్వాలిఫయర్స్‌లో పసికూన స్కాట్లాండ్తో చేతిలో 7 వికెట్లతో ఓడిపోయి క్వాలిఫయర్స్‌లోనే ఇంటిబాట పట్టింది.
వెస్టిండీస్.. ఈ మెగా టోర్నీ రేసు నుంచి తప్పుకోవడం వల్ల.. వరల్డ్ కప్ సూపర్ సిక్సెస్‌లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన జింబాబ్వే, శ్రీలంక జట్లకు వరల్డ్ కప్ టాప్-10లో నిలిచేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. అయితే గ్రూప్ దశలో నెదర్లాండ్స్ చేతిలోనూ విండీస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా, ఇండియా తర్వాత.. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ కప్‌ను ముద్దాడిన జట్టుగా నిలిచిన విండీస్‌కు.. ఈ విధంగా వరల్డ్ కప్ రేసు నుంచి నిష్క్రమించడం అవమానకరమే.
జింబాబ్వే వేదికగా శనివారం వెస్టిండీస్, స్కాట్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 43.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. కరేబియన్ జట్టులో జాసన్ హోల్డర్ 79 బంతుల్లో 45పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కాట్‌లాండ్ బౌలర్లలో బ్రాండన్ మైక్ ములెన్ మూడు వికెట్లు తీశాడు. తర్వాత 182 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన స్కాట్‌లాండ్ 43.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది.
ICC World Cup 2023 : అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 46 రోజుల పాటు ఈ టోర్నీలో మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే భారత్ సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఈ మెగా ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించాయి. మరో రెండు జట్లు జింబాబ్వేలో జరుతున్న క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా ప్రపంచకప్‌నకు అర్హత సాధించనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో రౌండ్ బిన్ పద్ధతిలో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో సెమీఫైనల్స్‌కు పాయింట్ల పట్టికలోని టాప్-4లో నిలిచిన జట్లు అర్హత సాధిస్తాయి.
ICC world Cup Schedule : అక్టోబర్ 8న అస్ట్రేలియాతో భారత్.. చెన్నై వేదికగా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న భారత్-పాక్‌తో తలపడనుంది. మరోవైపు లీగ్ దశలో టీమ్‌ఇండియా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగ్గా.. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.