ఐపీఎల్(IPL 2021) 14వ సీజన్ రెండో దశపై స్పందించాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా(Suresh Raina). తమ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(Dhoni) కోసం ఈసారి టైటిల్‌ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఫలితంగా సీఎస్కే ఖాతాలో నాలుగో టైటిల్‌ను చేరుస్తామని తెలిపాడు.
ఐపీఎల్ 15వ సీజన్‌కు ముందు ఈసారి మెగా వేలం జరగనుంది. ఒక్కో జట్టు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలుంది. దీంతో సీఎస్కే కెప్టెన్ ధోనీకి ఈ సీజన్ చివరిదని క్రీడాభిమానుల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైనా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"ఈ ఏడాది ఐపీఎల్ రెండో దశ కోసం దుబాయ్ వెళ్లగానే మాకో శిబిరం ఏర్పాటవుతుంది. మేమంతా కలిసికట్టుగా ఆడి మరోసారి టైటిల్‌ను సాధిస్తాం. ధోనీ నాయకత్వంలో ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాం" అని రైనా పేర్కొన్నాడు.
ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొచ్చేందుకు మహీ తమకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడని తెలిపాడు రైనా. జట్టు కోసం శక్తి మేరకు రాణించమని ఆటగాళ్లకు సూచిస్తాడని పేర్కొన్నాడు.
"మా జట్టులో మొయిన్ అలీ, సామ్ కరన్, డ్వేన్ బ్రేవో, రుతురాజ్ వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. ధోనీ కోసం ఈసారి టైటిల్ గెలుస్తాం. మహీ నుంచి నేనేంతో నేర్చుకున్నా. అతడు నాకు అన్నలాంటివాడు"
- సురేశ్ రైనా
ఇదీ చదవండి: Yuvraj Singh: చిన్న వయసులోనే కోహ్లీ ఎంతో సాధించాడు