టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత్ క్రికెట్ జట్టు.. ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలయ్యాక కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. "తీవ్ర నిరాశకు లోనయ్యాం. మేము బాగానే బ్యాటింగ్ చేశాం. మెరుగైన స్కోరు నమోదు చేయగలిగాం. కానీ బౌలర్లు రాణించలేకపోయారు. నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించడమే అతి ముఖ్యమైనది. అయినా, మా జట్టులోని ఆటగాళ్లకు ఇలాంటి మ్యాచ్‌లు కొత్తేమీ కాదు. వీళ్లంతా ఐపీఎల్‌లో ఆడినవాళ్లే. కానీ ఈరోజు మాకు శుభారంభం లభించలేదు" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
"ఇంగ్లాండ్ విజయంలో క్రెడిట్ మొత్తం ఓపెనర్లకే దక్కుతుంది. వాళ్లు అద్భుతంగా ఆడారు. మొదటి ఓవర్ నుంచే వారు దూకుడు ప్రదర్శించారు. టోర్నీ మొదటి మ్యాచ్‌లో మేము పట్టుదలగా ఆడిన తీరు గుర్తుండే ఉంటుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ హోరాహోరీ పోరు జరిగింది. ఏదేమైనా ఈరోజు మేము మా స్థాయికి తగ్గట్లు ఆడలేదు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాం. అందుకే ఇబ్బందుల్లో పడ్డాం"
-- రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది టీమ్ఇండియా. ఫైనల్‌కు చేరుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశను మిగులుస్తూ టోర్నీనుంచి నిష్క్రమించింది రోహిత్ సేన. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(50), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(63) అర్ధ శతకాలతో 168 పరుగులు చేయగలిగిన టీమ్ఇండియా.. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను నిలువరించలేకపోయింది. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 80, అలెక్స్ హేల్స్ 86 పరుగులతో చెలరేగి 16 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించారు. అద్భుత అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లలో 25, అర్ష్‌దీప్ సింగ్ రెండు ఓవర్లలో 15, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 30, మహ్మద్ షమీ 3 ఓవర్లలో 39, రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లలో 27 పరుగులు, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు.