VVS Laxman on Team India: టీమ్‌ఇండియా బ్యాటర్లు చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే దక్షిణాఫ్రికాలో మొదటిసారి టెస్ట్ సిరీస్‌ను గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించాడు. భారత జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అతిథ్య జట్టుతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. మొదటి టెస్టు డిసెంబరు 26 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే.. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత బౌలర్లు ఆకట్టుకున్నా.. బ్యాటర్లు మాత్రం నిరాశపర్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు సీనియర్ ఆటగాళ్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్ రాణించారు. దీంతో టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌పై పలు మాజీ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడాడు.
'చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కాన్పూర్ టెస్టులో అజింక్య రహానే ఔటైన తీరు.. అదే టెస్టుతో పాటు ముంబయిలో పుజారా ఔటైన విధానం దాదాపుగా ఒకే రకంగా ఉంది. శుభ్‌మన్ గిల్ తన ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మల్చగలడని నమ్ముతున్నాను. టీమ్‌ఇండియా ఐదుగురు పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌తో ఆడుతుంది. మొదటి ఐదుగురు బ్యాటర్లు క్రీజులో ఎంత సమయం గడిపారనే దానిని లెక్కించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో పొరపాటు జరిగి తప్పులు పునరావృతం అవుతున్నాయని, క్రీజులో కుదరుకున్న తర్వాత కూడా వారు సులభంగా తమ వికెట్‌ను కోల్పోతున్నారని నేను భావిస్తున్నాను. మంచి జట్లపై బాగా రాణించాలనుకుంటున్నప్పుడు ఈ సమస్యను అధిగమించాలి. ప్రత్యేకించి దక్షిణాఫ్రికాపై గెలవాలనుకుంటే బ్యాటర్లు చెలరేగాల్సిన అవసరం ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:
భరత్ గురించి ద్రవిడ్ అప్పుడే చెప్పాడు: లక్ష్మణ్
Shreyas Iyer VVS Laxman: శ్రేయస్ అయ్యర్‌పై వీవీఎస్ ప్రశంసలు
లక్ష్మణ్‌కు జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు.. జై షా క్లారిటీ!