BCCI Chief Selector Post : చీఫ్ సెలక్టర్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానించిన నేపథ్యంలో.. గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి పలు మాజీ క్రికెటర్ల తెరపైకి వచ్చాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో పాటు ఆ పోస్టు కోసం బోర్డు ఇదివరకే మాజీ స్టార్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను సంప్రదించిందని వార్తలు వచ్చాయి. ఈ విషయమై వీరూను వివరణ కోరగా.. ఆ వార్తలను తోసిపుచ్చాడు.
BCCI Chief Selector Salary : ప్రస్తుతం సెహ్వాగ్ పలు ప్లాట్‌ఫారమ్‌లపై అనలిస్ట్‌గా ఉంటూ.. అందుకు తగిన జీతభత్యాల్ని తీసుకుంటున్నాడు. దీంతో రూ. కోటి ప్యాకేజీ ఇచ్చే ఈ చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని.. ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. "సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్) మీటింగ్ సమయంలో, సెహ్వాగ్‌ను ప్రధాన కోచ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయమని అడిగారు. కానీ అది అనిల్ కుంబ్లేకు వెళ్లింది. ఇప్పుడు ఈ పోస్ట్‌కు అతడు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ప్యాకేజీ కూడా అతడి స్థాయి ఉన్నవారికి ఆర్థికంగా లాభదాయకం కాదు." అని ఓ బీసీసీఐ తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
అయితే జట్టు ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విషయాల గురించి బయట మాట్లాడడం వల్ల రాజీనామా చేయాలని చేతన్ శర్మను అప్పట్లో బీసీసీఐ ఆదేశించింది. దీంతో ఛీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. చేతన్ నిష్క్రమణ తర్వాత.. ఎస్ శరత్ (సౌత్), సుబ్రొతో బెనర్జీ (సెంట్రల్), సలీల్ అంకోలా (వెస్ట్)తో కూడిన కమిటీకి శివ సుందర్ దాస్ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు. సెలక్షన్ కమిటీలో సెంట్రల్, నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ అని ఐదు జోన్ల ఉంటాయి. ప్రతి జోన్ నుంచి ఒక్కో సభ్యుడి చొప్పును.. ఐదుగురు సభ్యులుంటారు. ఇందులో ఒకరు చీఫ్ సెలక్టర్‌గా ఉంటారు.
BCCI Chief Selector Notification : ఖాళీ అయిన చీఫ్ పోస్ట్ కోసం గురువారం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 30. ఐర్లాండ్‌తో సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీలో కొత్త సెలక్టర్ భాగమవుతారని భావిస్తున్నారు. అంతకన్నా ముందు అతడు దేవధర్ ట్రోఫీ, ఇంటర్ జోనల్ పోటీలు చూసే అవకాశముంది. సెలక్టర్ కావాలనుకునే వ్యక్తి ఏడు టెస్టులు లేదా పది వన్డేలు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.