Virat Kohli stats vs South Africa: మరికొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో తలపడనుంది టీమ్ఇండియా. ఇప్పటివరకు సఫారీ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ కైవస చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా ఎలాగైనా ట్రోఫీతో తిరిగి రావాలని పట్టుదలతో ఉంది కోహ్లీసేన. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఇప్పటికే ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు ఆటగాళ్లు. టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఇక టెస్టుల్లోనే అతడు సారథ్యం వహించనున్నాడు. దీంతో రెండేళ్ల నుంచి బ్యాటింగ్‌లో విఫలమవుతున్న ఇతడు ఈ పర్యటనలో రెచ్చిపోవాలని చూస్తున్నాడు. ఇక్కడి పిచ్‌లపై విరాట్‌కు మంచి రికార్డే ఉంది. అదేంటో చూద్దాం.
టెస్టుల్లో..
సఫారీ గడ్డపై ఐదు టెస్టులాడిన కోహ్లీ 55.80 సగటుతో 558 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉండటం విశేషం.
వన్డేల్లో..
వన్డేల విషయానికి వస్తే ఇక్కడ 17 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 15 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. 87.70 సగటుతో 877 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 160గా ఉంది. ఇందులో 3 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ గణాంకాలు చాలు సౌతాఫ్రికా గడ్డపై కోహ్లీ ఎంతగా చెలరేగి ఆడతాడో చెప్పడానికి. ఈ పర్యటనలోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని చూద్దాం.
India vs SA Series: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.