Virat Kohli Anushka Sharma: ఎప్పుడూ తమ పనులతో బిజీగా ఉండే సెలబ్రిటీ జోడీ టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ.. ఉత్తరాఖండ్‌లోని బాబా నీమ్ కరౌలీ ధామ్ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా హారతిలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆశ్రమంలో హనుమాన్ చాలీసా పఠించారు.
అయితే కోహ్లీ తన ఫ్యామిలీతో వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు.. ఆలయానికి భారీగా చేరుకున్నారు. కానీ కోహ్లీ, అనుష్క.. ఫ్యాన్స్‌ను కలవకుండానే అక్కడి నుంచి ముక్తేశ్వర్‌కు పయనమయ్యారు. అంతకుముందు కైంచి ధామ్ కమిటీ సభ్యులతో ముచ్చటించారు. ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో నీమ్ కరౌలి బాబా ఆశ్రమం ఉంది. సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆశ్రమం కైంచి ధామ్‌గా ప్రసిద్ధి చెందింది. 1964లో బాబా నీమ్ కరోలి మహారాజ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. బాబా నీమ్ కరౌలీ ఆంజనేయుడికి గొప్ప భక్తుడు. బాబా నీమ్ కరౌలీను విశ్వసించే వారు ఆయనను హనుమాన్ అవతారంగా భావిస్తుంటారు. అయితే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా నీమ్ కరౌలీ బాబా భక్తుడు కావడం విశేషం. బాబా గురించి జుకర్‌బర్గ్ ప్రధాని మోదీతో కూడా చర్చించారు.
ఇప్పటికే భారత ప్రధాని మోదీ, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్, యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖులు ఆశ్రమాన్ని సందర్శించారు. తాజాగా ఈ జాబితాలోకి క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చేరారు.
ఇదీ చదవండి: 'ఇప్పుడైతే మా టార్గెట్ ఆటను ఆస్వాదించడమే.. భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడతాం'