Vijay Hazare Trophy Hyderabad: తిలక్‌వర్మ (139; 123 బంతుల్లో 7×4, 8×6), చందన్ సహాని (87; 74 బంతుల్లో 5×4, 7×6) వీరవిహారం చేయడం వల్ల విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూపు-సి మ్యాచ్‌లో హైదరాబాద్ 79 పరుగుల ఆధిక్యంతో దిల్లీపై గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగులు సాధించింది. తిలక్, చందన్‌లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 152 పరుగులు జోడించారు. బదులుగా దిల్లీ 50 ఓవర్లలో 9 వికెట్లకు 246 పరుగులే చేయగలిగింది. హిమ్మత్‌సింగ్ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (3/33), కార్తికేయ (2/28), సి.వి.మిలింద్ (2/58), రవితేజ (1/61), మిఖిల్ (1/38) మెరిశారు.
ఆంధ్రకు మరో ఓటమి
Vijay Hazare Trophy Andhra: ఈ టోర్నీలో ఆంధ్రకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో విదర్భ 8 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు సాధించింది. జ్ఞానేశ్వర్ (93; 126 బంతుల్లో 7×4), అంబటి రాయుడు (53; 49 బంతుల్లో 2×4, 3×6), తపస్వి (45; 25 బంతుల్లో 6×4) మెరిశారు. అనంతరం విదర్భ 41.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 288 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అథర్వ (164 నాటౌట్; 123 బంతుల్లో 15×4, 5×6) అజేయ శతకంతో ఆంధ్రకు మ్యాచ్‌ను దూరం చేశాడు.