Vijay Hazare Trophy 2021 Hyderabad Team: విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఉత్తర్‌ప్రదేశ్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. యశ్ దయాళ్ (5/31), అంకిత్ రాజ్‌పుత్ (3/27), సమీర్ (2/16) ధాటికి 42.5 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ బుద్ధి (49; 63 బంతుల్లో 5×4, 2×6), రవితేజ (26; 62 బంతుల్లో 1×4, 1×6) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. కరణ్ శర్మ (44 నాటౌట్; 36 బంతుల్లో 4×4, 3×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని ఉత్తర్‌ప్రదేశ్ 26 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది. రెండు విజయాలు, రెండు ఓటములతో హైదరాబాద్ 8 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇన్నే పాయింట్లు ఉన్న యూపీ మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉండగా.. సౌరాష్ట్ర (16) అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆంధ్రకు రెండో విజయం
Vijay Hazare Trophy 2021 Andhra: కెప్టెన్ శ్రీకర్ భరత్ (161 నాటౌట్; 109 బంతుల్లో 16×4, 8×6) మెరుపు శతకానికి అశ్విన్ హెబ్బార్ (100; 132 బంతుల్లో 10×4) సమయోచిత సెంచరీ తోడవడం వల్ల ఈ టోర్నీలో ఆంధ్ర వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఎలైట్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఆంధ్ర 30 పరుగుల తేడాతో హిమాచల్‌ప్రదేశ్‌ను ఓడించింది. మొదట ఆంధ్ర 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసింది. భరత్, అశ్విన్ రెండో వికెట్‌కు 174 పరుగులు జత చేసి జట్టుకు మంచి స్కోరు అందించారు. అంబటి రాయుడు (34; 14 బంతుల్లో 2×4, 3×6) చివర్లో మెరుపులు మెరిపించాడు. గిరినాథ్‌రెడ్డి (4/52) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజృంభించడం వల్ల ఛేదనలో హిమాచల్ 46 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది. గిరినాథ్‌తో పాటు నితీష్‌కుమార్ (2/51), సాయితేజ (1/47), విజయ్ (1/26) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆంధ్ర రెండు విజయాలు, రెండు ఓటములతో 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది.