టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ షాట్ల ఎంపిక తనను నిరాశపరిచిందని క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అతడు తన ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు పన్నిన వలలో అతడు చిక్కుకుంటున్నాడని తెలిపారు.
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఔటైన కాసేపటికే హిట్‌మ్యాన్ వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ పేసర్లు ఉద్దేశ పూర్వకంగా వేసిన షార్ట్‌పిచ్ బంతులకు అతడు ఫుల్‌షాట్లు ఆడుతున్నాడు. ఒకట్రెండు సార్లు పరుగులు వచ్చినా వెంటనే ఔటైపోతున్నాడు. నాటింగ్‌హామ్ టెస్టులోనూ అతడు ఇలాగే ఔటయ్యాడు. ఇదే విషయాన్ని లక్ష్మణ్ గుర్తు చేశారు.
"రోహిత్‌శర్మ తనను తానే తక్కువ చేసుకుంటున్నాడు. నాటింగ్‌హామ్ టెస్టులోనూ అతడు ఇదే తరహాలో ఔటయ్యాడు. కొన్నిసార్లు మనకు ఇష్టమైన షాటే మన కొంప ముంచుతుంది. అతడు అందమైన సిక్సర్ బాదిన ఓవర్లోనే ప్రత్యర్థి కెప్టెన్ ఫీల్డింగ్‌లో స్వల్ప మార్పులు చేశాడు. రోహిత్‌శర్మతో ఫుల్‌షాట్ ఆడించాలనే అలా చేశారన్నది స్పష్టం. ఇది రోహిత్ శర్మ కోసం పన్నిన ఉచ్చు! అందులో అతడు చిక్కుకున్నాడు. ఆ షాటు ఆడిన విధానం కన్నా మెరుగైన అనుభవం అతడికి ఉంది" అని లక్ష్మణ్ అన్నారు.
"కేఎల్ రాహుల్ ఔటయ్యాక జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రోహిత్‌దే. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అందమైన కవర్‌డ్రైవ్‌లు ఆడాడు. బంతిని చక్కగా టైమింగ్ చేస్తున్నాడు. అతడు తన ఫామ్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ అతడి షాట్ల ఎంపిక మాత్రం నిరాశపరిచింది" అని వీవీఎస్ తెలిపారు. టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ కూడా ఫుల్‌షాట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని హిట్‌మ్యాన్‌కు సూచించారు.
ఇదీ చదవండి: 'అఫ్గాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఆడుతుంది'