ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు దాదాపు 20 రోజులు ఖాళీగా ఉండనున్నారన్న విషయం తనకు ఆశ్చర్యంగా అనిపించిందని మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ తెలిపాడు. సరైన సన్నద్ధత లేని కారణంగానే ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పొందిందని పేర్కొన్నాడు. అలాంటిది రూట్సేనతో సిరీస్‌కు ముందు ఇంత విరామం ఎందుకని వెంగ్‌సర్కార్ ప్రశ్నించాడు.
డబ్ల్యూటీసీ ప్రారంభ ఎడిషన్‌లో ప్రతి సిరీస్‌లో అదరగొట్టిన టీమ్ఇండియా.. నిర్ణయాత్మక మ్యాచ్‌లో చేతులెత్తేసింది. కఠిన క్వారంటైన్ నిబంధనల వల్ల టీమ్ఇండియాకు కేవలం ఒకే ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడటానికి వీలైంది.
"ఈ రెండేళ్ల కాలంలో టీమ్ఇండియా ఆడిన టెస్ట్ క్రికెట్‌ను చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. కోహ్లీసేన గొప్ప ప్రదర్శనలు చేసింది. సరైన సన్నద్ధత లేని కారణంగా ఫైనల్లో చతికిలపడింది. ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా లేకుండా వారు ఫైనల్‌కు వెళ్లడం చేటు చేసింది. మరోవైపు కివీస్.. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడడం కలిసొచ్చింది."
-దిలీప్ వెంగ్ సర్కార్, మాజీ చీఫ్ సెలెక్టర్.
"మూడు వారాల విరామం తర్వాత జులై 14న టీమ్ఇండియా ఆటగాళ్లు తిరిగి కలుసుకోనున్నారు. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే భారత ఆటగాళ్లు యూకేలో అడుగు పెట్టిన నాటి నుంచి ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడే నాటికి లెక్కేస్తే వారికి మొత్తం ఆరు వారాల పాటు ఖాళీ సమయం దొరికింది. ఈ షెడ్యూల్‌ను ఎలా అనుమతించారో తెలీదు. డబ్ల్యూటీసీ మ్యాచ్ తర్వాత వారం రోజుల సమయం సరిపోతుంది" అని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు.
"పరిస్థితులకు అలవాటు పడటానికి తగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లు అవసరమని కోహ్లీసేనకు సూచించాడు. డబ్ల్యూటీసీ మ్యాచ్‌లో భాగంగా తొలి రోజు వర్షార్పణం కాగా, రెండో రోజు మ్యాచ్‌లో టాస్ పడింది. ఈ లోపు అత్యుత్తమ జట్టును తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. సారథి కోహ్లీ ఆ పని చేయలేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ, పేస్ ఆల్‌రౌండర్ ఈ టూర్లో ఉంటే బాగుండేది. వెన్నునొప్పి కారణంగా హర్దిక్‌ను జట్టులోకి తీసుకోలేదు" అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.
కోహ్లీ నాయకత్వంలో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం టీమ్ఇండియాకు పెద్ద మిస్టరీగా మారిందని వెంగ్‌సర్కార్ తెలిపాడు.