వచ్చే ఏడాది జరిగే అండర్ -19 పురుషుల వన్డే ప్రపంచకప్‌నకు(Under 19 World Cup 2022) వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు పోటీలు జరుగుతాయి. టైటిల్ కోసం 14 దేశాలు 48 మ్యాచుల్లో తలపడతాయి. టోర్నీ చరిత్రలోనే తొలిసారి కరీబియన్ దేశాల్లో నిర్వహించడం విశేషం.
ఈ మేరకు ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ.. "ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఎప్పుడూ ప్రత్యేకమైందే. ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. జాతీయ జట్లకు ఆడే భవిష్యత్తు ఆటగాళ్లను నిర్ణయించే వాటిల్లో ఇదొకటి. అంతర్జాతీయంగా ఇతర దేశాల క్రికెటర్లతో ఆడే అవకాశం కల్పించడం వల్ల మంచి అనుభూతిని పొందవచ్చు. అయితే ఈసారి వెస్టిండీస్ వేదికగా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అన్ని జట్లు మంచి ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి" అని చెప్పారు.
కరీబియన్ దీవుల్లోని నాలుగు దేశాల్లో పది మైదానాల్లో పోటీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అంటిగ్వా అండ్ బార్బుడా, గయానా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ట్రినిడాడ్ అండ్ టొబాగొలో జరుగుతాయని పేర్కొన్నారు.
ఈసారి అండర్-19 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు పాల్గొనడం లేదు. క్వారంటైన్ నిబంధనలు ఉండటం వల్ల టోర్నీ నుంచి తప్పుకొంది. కివీస్‌కు బదులు స్కాట్లాండ్ బరిలోకి దిగబోతోంది. టీమ్‌ఇండియా సంగతికొస్తే.. ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఉగాండా దేశాలతో కూడిన గ్రూప్-బిలో ఉంది. జనవరి 15న దక్షిణాఫ్రికాతో, 19న ఐర్లాండ్‌తో, జనవరి 22న ఉగాండాతో టీమ్‌ఇండియా తలపడనుంది. గ్రూప్-ఏ లో గత ఛాంపియన్ బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, కెనడా, యూఏఈ ఉన్నాయి. గ్రూప్-సిలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే, పాపువా గినియా.. గ్రూప్-డిలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, స్కాట్లాండ్ పోటీపడనున్నాయి.
ఇదీ చదవండి: