క్రికెట్లో కవర్ డ్రైవ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ షాట్‌ను అందరూ ఆడలేరు. కొంతమంది మాత్రమే ఈ షాట్‌ను పర్ఫెక్ట్గా ఆడగలరు. ఒకప్పుడు సచిన్ తెందుల్కర్, ఇప్పడు విరాట్ కోహ్లీ ఇలా కొందరు క్రికెటర్లు ఆ షాట్ ఆడితే చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. వారి బ్యాట్ నుంచి జాలువారే ఆ షాట్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాగ కవర్ డ్రైవ్‌ను ఈ తరంలో చూడముచ్చటగా ఆడే క్రికెటర్లు ఎవరో చూద్దాం.
విరాట్ కోహ్లీ (భారత్)
![kohli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442075_cvover-3.jpg)
ప్రస్తుత తరం క్రికెటర్లలో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) అంత చక్కగా కవర్ డ్రైవ్‌ను ఎవరూ ఆడలేరని చెప్పవచ్చు. బ్యాట్, శరీరాన్ని సమన్వయం చేసుకుంటూ బంతిని ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీ దాటించే తీరు ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఈ షాట్‌ను ఆడేటపుడు కోహ్లీ ఫుట్‌వర్క్ అద్భుతమని ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు మెచ్చుకున్నారు. తన కెరీర్లో ఈ కవర్ డ్రైవ్ ద్వారా కోహ్లీ 74.14 సగటుతో 18.8 శాతం పరుగుల్ని సాధించాడు. ఈ షాట్ ఆడేపుడు కోహ్లీ కంట్రోల్ పర్సంటేజ్ 86.3గా ఉంది. అందుకే ఇతడిని ఉత్తమ కవర్ డ్రైవ్ ఆటగాడిగా చెప్పవచ్చు.
బాబర్ అజామ్ (పాకిస్థాన్)
![babar azam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442075_cvover-2.jpg)
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు బాబర్ అజామ్(Babar Azam). కొందరు ఇతడిని విరాట్ కోహ్లీతోనూ పోలుస్తుంటారు. అందులో కవర్ డ్రైమ్ ముఖ్యమైంది. అచ్చం కోహ్లీని కాపీ కొట్టినట్లుగా బాబర్ కవర్ డ్రైవ్ ఉంటుంది. అదే రీతీలో శరీరాన్ని సమన్వయం చేసుకంటూ అతడు బాదే డ్రైవ్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. అజామ్ తన కెరీర్లో కవర్ డ్రైవ్ ద్వారా 49.3 సగటుతో 21 శాతం పరుగుల్ని సాధించాడు. ఈ షాట్ ఆడేటపుడు ఇతడి కంట్రోల్ పర్సంటేజ్ 91.5 శాతంగా ఉంది.
తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)
![tamim iqbal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442075_cvover-1.png)
బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal)కు సరైనా గుర్తింపు రాలేదు కానీ.. ఈ కాలంలో ఇతడో అద్భుతమైన క్రికెటర్ అని చెప్పవచ్చు. 14 ఏళ్లుగా బంగ్లా తరఫున స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇందులో ఇతడు ఆడే కవర్ డ్రైవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇతడు 149.3 శాతం సగటుతో 21 శాతం పరుగుల్ని ఈ షాట్ ద్వారా సాధించాడు. బంగ్లా జట్టులో విలువైన ఆటగాడిగా గుర్తింపు పొందిన తమీమ్ జట్టును ఎన్నోసార్లు తన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు.
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
![warner](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442075_cvover-4.jpg)
ఈ మధ్య కాలంలో అత్యంత స్థిరమైన ప్రదర్శన చేస్తోన్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) ముందుంటాడు. బాల్ టాంపరింగ్ ఉదంతంతో నిషేధం ఎదుర్కొన్ని మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన వార్నర్.. ముందుకు మించిన దూకుడుతో ఆడుతున్నాడు. ఎన్నో సృజనాత్మక షాట్లు ఆడే ఈ బ్యాట్స్‌మెన్ కవర్ డ్రైవ్‌ను కూడా అలవోకగా ఆడేయగలడు. ఎక్కువగా టెస్టుల్లో ఇతడు ఈ షాట్‌ను ఆడతాడు. మొత్తంగా వార్నర్ తన కెరీర్లో ఈ షాట్ ద్వారా 121.63 సగటుతో 20 శాతం పరుగుల్ని సాధించాడు.
క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా)
![de kock](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442075_cvover-1.jpg)
దక్షిణాఫ్రికా జట్టులో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు సాధించాడు క్వింటన్ డికాక్(Quinton De Kock). ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లలో టాప్-15లో ఉంటాడు. లెఫ్ట్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన డికాక్ కవర్ డ్రైవ్ ఆడితే కనులవిందుగా ఉంటుంది. అతడి కవర్ డ్రైవ్‌కు ప్రేక్షకులతో పాటు క్రికెట్ పండితులు ఫిదా అయ్యారు. 2012లో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు ఇప్పటికే 10 వేలకు పైగా పరుగులు సాధించి ఆకట్టుకుంటున్నాడు.