Team India Records 2021: కరోనా కల్లోలంలో మరో ఏడాది గడిచిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ ఇయర్లో జరిగిన టీ20 ప్రపంచకప్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ క్రీడాభిమానులకు కాస్త ఉపశమనం కలిగించాయి. లాక్డౌన్ తర్వాత వరుస టోర్నీలతో టీమ్ఇండియా కూడా బిజీగా గడిపింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి నిరాశపర్చినా.. ఐపీఎల్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో పలు రికార్డుల్ని తిరగరాసింది. మరి అవేంటో చూద్దామా!
ఆస్ట్రేలియా గడ్డపై రెండుసార్లు టెస్టు సిరీస్ గెలిచిన తొలి జట్టుగా
ఈ ఏడాదిని టీమ్ఇండియా గొప్పగా ప్రారంభించింది. ఆస్ట్రేలియా గడ్డపై సగర్వంగా టెస్టు సిరీస్ గెలిచింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో తొలి టెస్టు ఓడిపోయింది. అనంతరం కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో జట్టు పగ్గాలు అందుకున్న రహానే సారథ్యంలో టీమ్ఇండియా గొప్పగా పుంజుకుంది. ఆస్ట్రేలియా కంచుకోటలు బ్రిస్బేన్, గబ్బాలో విజయాలతో అభిమానుల్ని గర్వించేలా చేసింది. సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై రెండుసార్లు టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. 2018/19లోనూ ఆసీస్‌పై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ విక్టరీ సాధించింది టీమ్ఇండియా.
రోహిత్.. అన్ని ఫార్మాట్లలోనూ 3 వేల పరుగుల రికార్డు
ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది టీమ్ఇండియా. ఈ సిరీస్‌లో మంచి ఫామ్ కనబర్చిన రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలోనూ 3 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతడి ఖాతాలో వన్డేల్లో 9205, టీ20ల్లో 3197, టెస్టుల్లో 3047 పరుగులు ఉన్నాయి. ఇతడి కంటే ముందు విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
రోహిత్.. టీ20ల్లో అత్యధిక అర్ధశతకాల రికార్డు
యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఓ రికార్డు సృష్టించాడు టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు(30) బాదిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. విరాట్ కోహ్లీ (29)ని దాటి ఈ రికార్డు కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (25) మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే టీ20ల్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన జాబితాలోనూ నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు రోహిత్. ఇతడు 4 సెంచరీలు చేయగా.. కివీస్ బ్యాటర్ కొలిన్ మున్రో 3 శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సులు బాదిన భారత క్రికెటర్లలో తొలి స్థానంలో ఉన్నాడు హిట్‌మ్యాన్. ఇతడి ఖాతాలో 150 సిక్సులు ఉండగా.. కివీస్ స్టార్ క్రికెటర్ గప్తిల్ 165 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
హర్భజన్ రికార్డును తిరగరాసిన అశ్విన్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది టీమ్ఇండియా. ఈ టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో మెరిసిన స్పిన్నర్ అశ్విన్.. హర్భజన్ రికార్డును తిరగరాశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. ఇతడి ఖాతాలో 427 వికెట్లు ఉండగా.. హర్భజన్ 417 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
అక్షర్ పటేల్ అదిరిపోయే రికార్డు
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అదిరిపోయే రికార్డు సాధించాడు టీమ్ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్. ఆడిన ఐదు టెస్టుల్లోనే ఐదుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. నరేంద్ర హిర్వాని, లక్ష్మణ్ శిమరామకృష్ణ మూడేసి ఐదు వికెట్ల ప్రదర్శనలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.