టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ప్రస్తుతం కీలక ఆటగాళ్లలో ఒకడిగా మారినప్పటికీ కొన్నాళ్ల క్రితం వరకూ జట్టులో స్థానం కోసం ఎదురుచూశాడు. వన్డేల్లో చోటు కోల్పోయి.. టెస్టుల్లో కొనసాగుతున్నా తుది జట్టులో చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అతడు తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అప్పుడు ఐదో టెస్టులో ఆడిన ఇన్నింగ్సే జడ్డూను టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా మార్చింది. అయితే అంతకుముందు చోటు దక్కని కారణంగా ఏడాదిన్నర పాటు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పాడు.
"అప్పుడు ఏడాదిన్నర పాటు నిద్రలేని రాత్రులు గడిపా. ఆ సమయంలో రోజూ తెల్లవారుజాము దాదాపు 5 గంటల వరకు మెలకువతోనే ఉండేవాడిని. ఏం చేయాలి. మళ్లీ ఎలా పుంజుకోవాలనే విషయాలపైనే ఆలోచించేవాడిని. దాంతో నిద్ర పట్టేది కాదు. అప్పుడు టెస్టు జట్టులో కొనసాగుతున్నా.. తుది జట్టులో మాత్రం ఉండేవాడిని కాదు. వన్డేల్లో చోటు కోల్పోయా. టీమ్‌ఇండియాతో(Team india) కొనసాగడం వల్ల దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడలేకపోయా. నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చేదికాదు. ఎలా ముందుకు సాగాలో అనేదానిపై తీవ్రంగా ఆలోచించేవాడిని. కానీ, 2018లో ఆడిన ఓవల్ టెస్టే(Oval Test) మొత్తం మార్చేసింది. అది నా ఆటను, నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తర్వాత హార్దిక్ పాండ్య గాయపడటం వల్ల నేను వన్డేల్లోకి తిరిగి వచ్చా. నాటి నుంచి నేను బాగా ఆడుతున్నా."
-జడేజా, టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్.
ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 332 పరుగులు చేయగా, టీమ్‌ఇండియా 160కే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అదే సమయంలో జడేజా(86 నాటౌట్; 156 బంతుల్లో) ఎనిమిదో ఆటగాడిగా బరిలోకి దిగి జట్టును ఆదుకున్నాడు. హనుమ విహారి(56; 124 బంతుల్లో)తో కలిసి ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోరును 292 పరుగులకు చేరవేశాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే జడ్డూ తర్వాతికాలంలో కీలక ఆటగాడిగా మారాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోనూ జడేజా(77).. ధోనీ(50)తో కలిసి మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలైనా అతడి పేరు మాత్రం మార్మోగిపోయింది.
ఇదీ చూడండి Kohli: ధోనీ గురించి కోహ్లీ రెండు మాటల్లో