ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు రేసులో భారత్ నుంచి సూర్యకుమార్ యాదవ్ మాత్రమే నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో అదరగొట్టిన సూర్య 'మిస్టర్ 360' బ్యాటర్‌గా పేరు తెచ్చుకొన్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ను భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభినందనలతో ముంచెత్తాడు. 2022వ సంవత్సరం సూర్యకుమార్‌దేనని ఘంటాపథంగా చెప్పాడు. ఫామ్ లేక చాలా మంది క్రికెటర్లు ఇబ్బంది పడిన వేళ సూర్య మాత్రం ఉత్తమ ప్రదర్శన చేశాడని చోప్రా పేర్కొన్నాడు.
"ఈ ఏడాది సూర్యకుమార్‌కు బాగా కలిసివచ్చింది. భారత్‌కు కలిసిరాని 2022వ సంవత్సరం సూర్యకుమార్ స్థాయిని మాత్రం అమాంతం పెంచేసింది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శనను మనం చూశాం. అందుకే టీ20 ఐసీసీ అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో టాప్ ర్యాంక్‌ను దక్కించుకొన్నాడు. ఈసారి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కచ్చితంగా సూర్యకుమార్ అందుకొంటాడు" అని చోప్రా వెల్లడించాడు. ఈ ఏడాది 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ రెండు సెంచరీల సాయంతో 1,164 పరుగులు సాధించాడు.
ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో ఆడతాడని ఎవరూ ఊహించలేదని చోప్రా గుర్తు చేశాడు. "ఐపీఎల్‌లోనూ విరాట్ గొప్ప ప్రదర్శన ఇవ్వలేదు. అర్ధశతకాలు సాధించినా అభిమానులను, విమర్శకులను ఆకట్టుకోలేకపోయాడు. ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత పుంజుకొని జట్టులోకి రావడం అద్భుతం. టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టి ఏకంగా టాప్ స్కోరర్‌గా మారాడు. ఆసీస్ పిచ్‌లపై పాకిస్థాన్, ఇంగ్లాండ్ వంటి జట్లను తట్టుకొని కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు" అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.