ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్టు ఫలితంపై సానుకూల వ్యాఖ్యలు చేశాడు కివీస్ బౌలింగ్ కోచ్ షేన్ జర్గన్సేన్. వర్షం కారణంగా ఒక రోజు ఆట తుడిచిపెట్టుకుపోయినా.. ఈ మ్యాచ్లో ఫలితం రావడానికి ఆస్కారముందని పేర్కొన్నాడు.
"ఇంగ్లాండ్తో తొలి టెస్టులో భాగంగా వర్షం కారణంగా మూడో రోజు ఆటలో ఒక్క బంతి పడలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, మేం ఆటపై ఆధిపత్యం సాధించడానికి కావాల్సినన్ని పరుగులు చేశాం. వర్షం వల్ల ఒకరోజు ఆట వృథా అయింది. అయినప్పటికీ ఈ రెండు రోజుల్లో ఫలితం వస్తుంది. అది కొంత కష్టమే అయినప్పటికీ ఆ తరహా ఆలోచనే ఉండాలి. ఈ మ్యాచ్లో ఇప్పటివరకు మాదే పై చేయి" అని జర్గన్సేన్ తెలిపాడు.
ఇంగ్లాండ్తో తొలి టెస్టులో కివీస్ తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 111 రన్స్ సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి మరో 267 పరుగులు వెనుకబడి ఉంది రూట్ సేన.
ఇదీ చదవండి: వార్నర్.. ఈ సారి టైగర్ ష్రాఫ్లా!