భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో, మూడో టెస్టు(Ind vs Eng 3rd test 2021) జరుగుతుండగా మైదానంలోకి వచ్చి నవ్వులు పూయించిన డేనియల్ జార్వో(ఇంగ్లాండ్) అనే అభిమాని.. తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాను మైదానంలోకి వెళ్లినప్పుడు ఇంగ్లీష్ జట్టు భయపడిందని అన్నాడు. తానెక్కడ టీమ్ఇండియాను గెలిపిస్తాడో అని ఇంగ్లాండ్ టీమ్ ఆటగాళ్లు భావించారని పేర్కొన్నాడు.
టీమ్ఇండియాకు తాను నిజమైన అభిమానిని అని, ఇది పబ్లిసీటీ కోసం చేసింది కాదని చెప్పుకొచ్చాడు జార్వో(Jarvo Ind vs Eng). ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు ఆటగాళ్లు తనతో మాట్లాడిన విధానం నచ్చిందని చెప్పాడు. అప్పటినుంచే భారత జట్టుకు అభిమానిగా మారినట్లు వెల్లడించాడు.
భారత జట్టులో సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ తన ఫేవరేట్ ఆటగాళ్లని జార్వో(Jarvo Cricketer) ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రపంచకప్‌లోనైనా సరే.. ఇంగ్లాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరిగితే తన మద్దతు భారత్‌కే అని పేర్కొన్నాడు.
క్రేజీ చేష్టలు..
ఓ వైపు ఉత్కంఠగా మ్యాచ్ సాగుతుంటే.. జార్వో మైదానంలోకి బ్యాట్ పట్టుకుని భారత్ తరఫున ఆడటానికి వచ్చాడు. భారత జెర్సీని ధరించి బ్యాటింగ్‌కు దిగడం, భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించడం వంటివి చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అనంతరం.. హెడింగ్లే స్టేడియం యాజమాన్యం జార్వోపై జీవితకాల నిషేధం విధించింది. ఇకపై ఎప్పుడూ అతడు మైదానానికి రాకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి:IndvsEng: ఆ అభిమానిపై జీవితకాల నిషేధం