2011 ప్రపంచకప్ గెలిచిన రోజు తన జీవితంలో అత్యుత్తమమని అభిప్రాయపడ్డాడు దిగ్గజ సచిన్ తెందూల్కర్. ఆరోజు తన అతిపెద్ద కల నిజమైందని అన్నాడు. అన్ అకాడమీ సెషన్లో స్థితిస్థాపకత, ఆశయం, సన్నద్ధత, ఆవిష్కరణ అనే అంశాలపై ప్రసంగం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై గెలిచి, తన రెండో వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకుంది భారత్. ఈ ఏడాదితో ఆ ఘనతకు పదేళ్లు పూర్తయ్యాయి.
"కపిల్ దేవ్ 1983 ప్రపంచకప్ ఎత్తుకోవడం చూసినప్పుడు నమ్మశక్యం కాని అనుభూతి కలిగింది. నా స్నేహితులతో కలిసి దానిని ఎంతో ఎంజాయ్ చేశాను. నేను కూడా నా కల నెరవేర్చుకోవాలనుకున్నా. ఎట్టిపరిస్థితుల్లో ప్రపంచకప్ ముద్దాడాలనుకున్నా. దానిపైనే దృష్టిపెట్టా. ముంబయిలోని వాంఖడేలో వరల్డ్ కప్ గెలవడం అత్యద్భుతం. అది నా జీవితంలోనే అత్యుత్తమైన రోజు. యావద్దేశం చేసుకునే ఉత్సవాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఇది ప్రత్యేకం"
- సచిన్ తెందూల్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
దేశం గెలిచింది..
"ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో విరాట్, యూసుఫ్ పఠాన్ నన్ను ఎత్తుకున్నారు. నేను పడిపోకుండా చూడమని వాళ్లకు చెప్పాను. గెలిచింది కేవలం టీమ్ఇండియా కాదు. యావద్దేశం. మనందరం" అని సచిన్ ఆనాటి క్షణాల్ని గుర్తు చేసుకున్నాడు.
ఇదీ చూడండి: కోహ్లీనీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా: పైన్