ICC T20 World Cup 2022 : టీ20 వరల్డ్ కప్ పోరుకు ముందు జరిగిన తొలి సన్నాహక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై 13 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛేదనలో ప్రత్యర్థి జట్టు 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. సామ్ ఫాన్నింగ్ (59) మాత్రమే ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. 3 ఓవర్లలో అతడు కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడెన్ కూడా ఉంది. భువనేశ్వర్, యజ్వేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు టీమ్‌ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో కేల్ రాహుల్, విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ(3)తోపాటు కీపర్ రిషభ్ పంత్(9) ఓపెనింగ్‌కి దిగారు. అయితే, ఈ ఇద్దరు స్పల్ప స్కోర్లకే ఔటవగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగాడు. 35 బంతుల్లో 52 రన్స్ చేశాడు. అతడికి దీపక్ హుడా (22), హార్దిక్ పాండ్య (27) సహకారం అందించారు.
ఇవీ చదవండి : అదరగొడుతున్న అమ్మాయిలు.. ఆసియా కప్‌లో థాయ్‌లాండ్‌పై ఘన విజయం
'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా హర్మన్.. పురుషుల్లో అవార్డు అతడికే..