ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించే సత్తా భారత్ సొంతమని పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్ క్రికెట్ చాలా పటిష్ఠంగా ఉందని తెలిపాడు.
"భారత్ త్వరలో రెండు జట్లను బరిలోకి దించుతోంది. ఈ ఘనత అంతా టీమ్ఇండియాదే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. మరొక టీమ్ శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఏక కాలంలో రెండు జట్లతో రెండు సిరీస్‌ల్లో పాల్గొననుంది. వారి క్రికెట్ సంస్కృతి చాలా బలంగా ఉంది. రెండు కాదు మూడు జట్లను కూడా ఫీల్డ్‌లోకి దించగల సత్తా టీమ్ఇండియాకు ఉంది. ప్రారంభ స్థాయి నుంచి దృఢమైన ఆటగాళ్లు ఉండటమే ఇందుకు కారణం."
-కమ్రాన్ అక్మల్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
"యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ మంచి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయన గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది క్రికెటర్లను తయారు చేశాడు. కోచ్ రవిశాస్త్రి కూడా జట్టుకు అద్భుతంగా గైడ్ చేస్తున్నాడు. మాజీ కెప్టెన్ ధోనీ నాయకత్వాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ మంచిగా అందిపుచ్చుకున్నాడు. విరాట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడు. అతడు గాయపడితే కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. ఇలా చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. ఒకవేళ ఇండియా-సీ టీమ్‌ను శ్రీలంక పర్యటనకు పంపినా.. అది గెలుస్తుంది" అని అక్మల్ తెలిపాడు.
ఇదీ చదవండి: ipl 2021: యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశ