మార్చి 31న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023కు టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైనట్లు తెలుస్తోంది. గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా.. కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఈ స్టార్ ప్లేయర్ జూన్‌లో జరగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.
గాయం కారణంగా ఐదు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఎన్సీఏలో రిహబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీకే ఈ ప్లేయర్ అందుబాటులో ఉంటాడని భావించారు. మొదటి రెండు టెస్టులు ఆడకపోయినా.. ఆ తర్వాత ప్రకటించిన జట్టులో కూడా బుమ్రా పేరు రాలేదు. ఐపీఎల్కైనా అందుబాటులోకి వస్తాడనుకంటే.. ఇప్పుడు అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే, అనుకున్నదాని కంటే గాయం తీవ్రంగా ఉంది. దాని కారణంగానే బుమ్రా కోలుకోడానికి ఎక్కువ సమయం పడుతోందని సమాచారం. ఇక, బుమ్రా తాజా పరిస్థితి.. ముంబయి ఇండియన్స్ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. అయితే బుమ్రా స్థానంలో జొఫ్రా ఆర్చర్ జట్టులోకి రావడం ముంబయి టీమ్‌కు కాస్త ఉపశమనం కలిగించే విషయం.
బుమ్రా చివరగా గతేడాది సెప్టెంబర్ 25న ఆసీస్‌తో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌నకు కూడా మిస్ అయ్యాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తర్వాత ఆసీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం బుమ్రాకు ఎన్సీఏ క్లియరన్స్ ఇవ్వలేదు. మెగా టోర్నీల నేపథ్యంలో బుమ్రా విషయంలో ఇప్పుడే తొందరపడొద్దని ఎన్సీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది.