టన్నుల కొద్దీ పరుగులు.. మంచి నీళ్ల ప్రాయంగా శతకాలు.. ఎందరో మేటి బౌలర్లకు పీడకలలు.. ఎన్నెన్నో వీరోచిత ఇన్నింగ్స్‌లు.. విరాట్ కోహ్లి అంటే మామూలు బ్యాటర్ కాదు. క్రికెట్లో ఇలా ఆడడం సాధ్యమేనా.. అసలితను మానవమాత్రుడేనా.. ఇలాంటి బ్యాట్స్‌మన్ ఒకడుంటాడా అని క్రికెట్ ప్రపంచమంతా విస్తుబోయేలా చేసిన అసాధారణ పరుగుల యంత్రం విరాట్ కోహ్లి! మరో బ్యాటర్‌కు అసాధారణంగా అనిపించే విషయాల్ని తన విషయంలో చాలా సాధారణంగా మార్చేసి.. అభిమానుల అంచనాలను ఎప్పటికప్పుడు మించిపోతూ తనకు తాను అత్యున్నత ప్రమాణాలు నిర్దేశించుకున్న విలక్షణ బ్యాటర్ విరాట్. కానీ ఇదంతా గతం!
ప్రపంచ క్రికెట్లో ఎవ్వరూ అందుకోలేని ఎత్తులను చూసిన అతనే.. తన స్థాయి దిగ్గజ క్రికెటర్లు ఎవ్వరూ చూడని పతనం కూడా చూశాడు. ఒక్క ఏడాదిలో 11 శతకాలు బాదిన వాడు.. రెండున్నరేళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ ఒక్కసారి కూడా మూడంకెల స్కోరు సాధించలేదంటే అంతకంటే పతనం ఏముంటుంది? ఒక దశ వరకు శతకం కోసం ఎదురు చూసిన అభిమానులు.. ఆ తర్వాత అతనో 50 పరుగులు చేసినా చాలనుకునే స్థాయిలో వరుస వైఫల్యాలు చవిచూశాడు. మేటి బౌలర్లను చితక్కొట్టి వాళ్ల కెరీర్లో ఎన్నడూ చూడని పరాభవాలను మిగిల్చిన వాడు.. సాధారణ బౌలర్లకు తలవంచి అందరూ తనవైపు జాలి చూపులు చూసే స్థితికి చేరుకున్నాడు. విరాట్ ఉచ్ఛ స్థితి అయిపోయిందని.. దాన్ని అందుకోవడం పక్కన పెడితే.. జట్టులో కొనసాగడమే కష్టమనే పరిస్థితి వచ్చింది కొన్ని నెలల ముందు. ఈ పేలవ దశను అధిగమించి కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అతడిలో ఒకప్పటి సాధికారిత, ఆత్మవిశ్వాసం, దూకుడు కనిపించలేదు. బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం చలాయించే విరాట్ మార్కు ఆటను అభిమానులు చూడలేకపోయారు. మళ్లీ ఆ కోహ్లీని చూడలేం అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసిన సమయంలో ఆదివారం అసాధారణ బ్యాటింగ్‌తో తనలోని ఒకప్పటి మేటి బ్యాటర్‌ను సాక్షాత్కరింపజేశాడు విరాట్.
ఎవరి వల్లా కానిది.. గుర్తుందా పాక్‌తో ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ ఆఖర్లో ఏం జరిగిందో? చివరి ఓవర్లో బంతి వృథా అయిందని అవతలి బ్యాటర్ కంగారు పడుతుంటే.. ‘‘భయపడకు. నేను చూసుకుంటా’’ అన్నట్లు హార్దిక్ పాండ్య ఎంత ధీమాగా కనిపించాడో! ఆ తర్వాతి బంతికే సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడతను. ఆ రోజు చెలరేగిన హార్దిక్ కూడా ఆదివారం ఒక దశలో షాట్లు ఆడలేక ఇబ్బంది పడ్డాడు. ఇక నిదహాస్ ట్రోఫీలో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టును గెలిపించడమే కాక ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌ల్లో ఒత్తిడిలో భారీ షాట్లు ఆడిన చరిత్ర ఉన్న దినేశ్ కార్తీక్ సైతం ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. 360 డిగ్రీల కోణంలో షాట్లు ఆడే సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో రెండు మూడు మెరుపు షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరిపోయాడు. ఇక ఓపెనర్లేమో ఆరంభంలోనే చేతులెత్తేశారు. అయితే ఈ వైఫల్యాలకు ఎవ్వరినీ తప్పుబట్టలేం. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి మరి. చాలా పెద్ద బౌండరీలున్న మెల్‌బోర్న్ స్టేడియంలో, పేస్ అనుకూల పరిస్థితుల్లో, ప్రపంచ స్థాయి పాక్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని పరుగులు చేయడమంటే మాటలు కాదు. అందులోనూ భారత్ చేతిలో ఓడితే స్వదేశంలో ఎలాంటి పరిస్థితులుంటాయో తెలుసు కాబట్టి పాక్ ఆటగాళ్లు ప్రాణం పెట్టి పోరాడారు. ఇలాంటి మ్యాచ్‌లో ఎవ్వరి వల్లా కానిది విరాట్ సాధించాడు. ఒకప్పుడు భీకర ఫామ్‌లో ఉండగా విరాట్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే అభిమానులు అంతగా ఆశ్చర్యపోయేవారు కాదు. ఇంతగా పరవశించిపోయేవారు కాదు. కానీ పేలవ ఫామ్‌తో సతమతం అయి.. పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయి.. ఒక దశలో జట్టులో చోటే ప్రశ్నార్థకంగా మారి.. వీరాభిమానులు సైతం తనపై నమ్మకం కోల్పోయిన స్థితి నుంచి పుంజుకుని విరాట్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం అసాధారణం. ప్రపంచ ప్రఖ్యాత బ్యాటర్లు చాలా మంది తమ కెరీర్లో పతాక స్థాయి నుంచి కింద పడ్డాక.. మళ్లీ పుంజుకుని ఇలాంటి మేటి ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు అరుదు.
తనవి కాని షాట్లు.. ప్రతి బ్యాట్స్‌మన్‌కూ తనవంటూ కొన్ని షాట్లు ఉంటాయి. చాలా వరకు ఆ షాట్లే ఆడతాడు. కోహ్లివి చాలా వరకు సంప్రదాయ షాట్లే. డివిలియర్స్, సూర్యకుమార్‌ల తరహాలో 360 డిగ్రీల కోణంలో అతను షాట్లు ఆడడు. కానీ ఆదివారం పాకిస్థాన్‌పై విరాట్ ఆడిన రెండు షాట్లు చూసి అవి ఆడింది అతనేనా అని షాకైపోయారు అభిమానులు. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి తన శైలికి విరుద్ధంగా రెండు కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. కొంచెం బౌన్స్ అయిన రవూఫ్ బంతిని విరాట్ స్ట్రెయిట్ సిక్సర్‌గా మలిచిన తీరు అసామాన్యం. కాళ్ల దగ్గర పడ్డ తర్వాతి బంతిని వికెట్ వెనుక స్టాండ్స్‌లో పడేసిన తీరు మరింత విస్మయం కలిగించేదే. మ్యాచ్‌లో అతి పెద్ద మలుపు ఈ రెండు షాట్లే. తీవ్ర ఒత్తిడిలో కోహ్లి కొట్టిన ఈ రెండు సిక్సర్లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేవే.
ఇదీ చూడండి: పాకిస్థాన్‌పై భారత్ సూపర్ విక్టరీ.. నెట్టింట మీమ్స్ హల్చల్