ఉత్కంఠభరిత పోరులో భారత్ విజయం.. వినటానికి ఇది బాగానే ఉన్నా.. మ్యాచ్‌పై ఆద్యంతం భారత్ పట్టు చూపించలేదనే దానర్థం. భారత్ టీ20 ప్రపంచకప్ సాధించేందుకు ఇంకా కేవలం 3 మ్యాచ్‌ల దూరంలో ఉంది. మూడు మ్యాచ్‌లూ గెలిచి తీరాల్సినవే. ఇండియా ఆటగాళ్ల ఘనమైన రికార్డులతో జట్టు పేపర్‌పై బలంగానే కనిపిస్తోంది. కానీ, ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌పై మినహా భారత్ రెండు మ్యాచ్‌లను చివరి నిమిషంలో గెలుచుకొంది. బలమైన సౌతాఫ్రికాపై ఓడిపోయింది. ఛాంపియన్ స్థాయిలో మ్యాచ్ ఫలితాలను నియంత్రించడంలో భారత్ జట్టు అనుకొన్నస్థాయిలో ఆడలేదనే చెప్పాలి.
పవర్‌ప్లే వాడుకోలేక.. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలో భారత్ ఒక్కసారి కూడా స్కోర్‌ను 50 దాటించలేకపోయింది. పాక్‌పై 33, నెదర్లాండ్స్‌పై 32, దక్షిణాఫ్రికాపై 33, బంగ్లాదేశ్‌పై 37 స్కోర్లు చేసింది. ఫీల్డింగ్ నిబంధనలు వినియోగించుకొని భారీ షాట్లతో స్కోర్ బోర్డును 10 రన్‌రేట్‌తో పరుగులు పెట్టించాల్సిన సమయంలో రక్షణాత్మక వైఖరిలో భారత్ ఆడుతోంది. టీ20ల్లో మ్యాచ్ గమనం వేగంగా మారిపోతుంది. అటువంటిది.. భారీ షాట్లు కొట్టే అవకాశాలను భారత్ చేజేతులా వదులుకుంటోంది.
నిలకడ లేని ఓపెనింగ్ జోడీ.. ఓపెనింగ్ జోడీ ఇప్పటి వరకు కుదురుకోలేదనే చెప్పాలి. రోహిత్-రాహుల్ జోడీ ఒక్క అర్ధశతక భాగస్వామ్యం కూడా నమోదు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోహిత్ వ్యక్తిగతంగా నెదర్లాండ్స్‌పై అర్ధశతకం కొడితే.. రాహుల్ బంగ్లాదేశ్‌పై 50 పరుగులు సాధించాడు. ఈ జోడీ పాక్‌పై 7, నెదర్లాండ్స్‌పై 11, దక్షిణాఫ్రికాపై 23, బంగ్లాదేశ్‌పై 11 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పింది. పొట్టి ఫార్మాట్‌లో ఆటగాళ్ల అతిపెద్ద శత్రువు ఒత్తిడి. అది ఎప్పుడైతే జట్టుపై ప్రభావం చూపిస్తుందో ఆట ఫలితం వేగంగా మారిపోతోంది. ఓపెనర్లలో ఒకరు క్రమం తప్పకుండా పాతిక పరుగులు పూర్తికాకుండానే పెవిలియన్ చేరుకోవడం మిగిలిన ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఓపెనర్లు నిలకడగా ఆడితే మిడిల్ ఆర్డర్ స్వేచ్ఛగా ఆడే అవకాశం లభిస్తుందని పలువురు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రాహుల్ కూడా పుంజుకొన్నట్లు కనిపించడంతో కీలకమైన జింబాబ్వే మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు ఉపశమనం లభిస్తుందని ఆశించాలి.
పేక మేడను తలపిస్తున్న మిడిల్ ఆర్డర్.. భారత మిడిల్ ఆర్డర్‌లో సూర్య, హార్దిక్ మినహా 30 పరుగులు దాటి స్కోర్ చేసిన బ్యాటర్ లేడు. అక్షర్ పటేల్(2,7) దినేష్ కార్తీక్(1,6,7), హుడా (0) ఈ టోర్నీలో ఒక ఇన్నింగ్స్‌లో 10 పరుగులు కూడా చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హార్దిక్ కూడా పాక్‌పై (40) కీలక ఇన్నింగ్స్ మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మన్‌గా పెద్దగా ప్రభావం చూపలేదు. దక్షిణాఫ్రికాపై 2, బంగ్లాదేశ్‌పై 5 పరుగులే చేశాడు. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌కు బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక పాక్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై బ్యాటింగ్ చేసిన మిడిల్ ఆర్డర్‌లో సూర్య కుమార్ మినహా కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఒక్కోసారి రెండంకెల స్కోరు చేయడం ఆందోళనకరం. భారీ ఇన్నింగ్స్ నిర్మించాలంటే ఇక్కడ నిలకడగా రాణిస్తున్న కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌కు సహకారం అందించే వారుండాలి. ఇది జరగాలంటే హార్దిక్, డీకే బ్యాటింగ్‌లో స్థిరంగా రాణించాల్సిందే.
మిడిల్ ఓవర్లలో సమర్థ బౌలర్ కరవు.. భారత పేస్ దళం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో ప్రభావవంతంగానే ఉంది. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ నిలకడగా వికెట్లు సాధిస్తూ ఈ టోర్నీలో టాప్ బౌలర్‌గా నిలిచాడు. మిడిల్ ఓవర్లలో పాండ్యా కూడా వికెట్లు సాధిస్తూ మ్యాచ్ ఫలితాలను శాసించాడు. పాక్‌పై తొలి మ్యాచ్‌లో అక్షర్, అశ్విన్‌లు నాలుగు ఓవర్లు వేయగా.. 44 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా సాధించలేదు. ఈ జోడీ నెదర్లాండ్స్‌పై నాలుగు వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికాపై అశ్విన్ 10.80 ఎకానమీతో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లకు 28 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. పవర్ ప్లే మాదరిగా మిడిల్ ఓవర్లలో ఫీల్డింగ్ నిబంధనలు ఉండవు. అటువంటి సమయంలో అశ్విన్ ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆందోళనకరంగా మారింది.
ఆస్ట్రేలియాలోని పిచ్‌లను బట్టి తుదిజట్టు ఎంపికలో భారత్ మార్పులు చేసుకోవాలి. పెర్త్, మెల్‌బోర్న్ వంటి మైదానాలు బ్యాటర్లను కుదురుకోనివ్వవు. అటువంటి చోట్ల నాలుగో సీమర్‌తో బరిలోకి దిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ముగ్గురు సీమర్లతో భారత్‌పై ఆడిన పాక్.. దక్షిణాఫ్రికాపై నలుగురు సీమర్లతో బరిలోకి దిగి విజయం సాధించింది. లీగ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరైన చాహల్‌ను బెంచ్‌కే పరిమితం చేయకుండా అవకాశాలు ఇవ్వాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టీ20 ఫార్మాట్‌లో ఒక ఓవర్లో రెండు వికెట్లు పతనమైనా లేదా బ్యాటర్ రెండు సిక్స్‌లు కొట్టినా మ్యాచ్ ఫలితమే మారిపోతోంది. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో దాస్ రనౌట్ దీనికి మంచి ఉదాహరణ. ఒత్తిడిలో రాణించడం మంచిదే.. కానీ, మ్యాచ్ ఒత్తిడికి గురయ్యేదాకా తెచ్చుకోకపోవడం బెటర్. మ్యాచ్ మొదటి నుంచి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పట్టు బిగించడం చాలా అవసరం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఈ ఒక్కటే తగ్గింది..!
ఇవీ చదవండి:T20 worldcup: మళ్లీ అంపైరింగ్ పొరపాటు.. ఈసారి ఆ విషయంలో