T20 World Cup India Squad : అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడా భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సెప్టెంబర్ 16న ప్రకటించనుంది. ఇప్పటికే ఇంగ్లండ్, సౌతాఫ్రికా,ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించగా.. బీసీసీఐ మాత్రం వెనకాడుతోంది. స్టార్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతో సతమతమవుతుండటం కారణంగా.. చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ టైమ్ తీసుకుంటుంది. గాయాల కారణంగా బుమ్రా, హర్షల్ పటేల్ ఆసియాకప్‌కు దూరమయ్యారు.
అయితే వీరి గాయాలపై స్పష్టత వచ్చిన వెంటనే జట్టును ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే బుమ్రా, హర్షల్ పటేల్‌లకు ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. 'జట్టు వివరాలను అందజేసేందుకు కొన్నిరోజులు మాత్రమే సమయం ఉంది. మాకు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఫిట్‌నెస్ అప్‌డేట్స్ అందాల్సి ఉంది. వారి గాయాలపై స్పష్టత వచ్చిన వెంటనే జట్టును ప్రకటిస్తాం. ఎన్‌సీఏలో బుమ్రా, హర్షల్ పటేల్‌లకు ఫిట్‌నెస్ టెస్ట్ జరగనుంది' అని ఓ సెలెక్షన్ కమిటీ సభ్యుడు తెలిపారు.
బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతుండగా.. హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే హర్షల్ పటేల్ పూర్తిగా కోలుకుని జట్టులోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడని, బుమ్రా గాయంపై మాత్రం సందేహాలు నెలకొన్నాయని ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే హర్షల్ పటేల్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండగా.. బుమ్రా మాత్రం కాస్త సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్ రిపోర్ట్ కోసం రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టు వివరాలను అందజేయడానికి ఐసీసీ సెప్టెంబర్ 16ను డెడ్‌లైన్‌గా విధించింది. భారత సెలెక్షన్ కమిటీ కూడా అదే రోజు సమావేశమై జట్టును ప్రకటించనుంది. మోకాలి శస్త్ర చికిత్సతో ఈ టోర్నీకి రవీంద్ర జడేజా దూరం కాగా.. హర్షల్ పటేల్ ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే సిరీస్‌లకు అందుబాటులోకి రానున్నాడు. బుమ్రా గాయంపై మాత్రం సందేహాలు నెలకొన్నాయి. అతడికి బ్యాకప్‌గా షమీని ఎంపిక చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: 'పాక్ కెప్టెన్ నేనే' అని చెప్పుకుంటున్న బాబర్.. ఇంతకీ ఏమైంది?
'కోచ్‌గా ద్రవిడ్ హనీమూన్ కాలం ముగిసింది.. ఇక జట్టుపై దృష్టి పెట్టాలి'