T20 World Cup Ben Stokes: టీ20 ప్రపంచకప్-2022 ట్రోఫీని ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
స్టోక్స్ ఆల్‌రౌండ్ షో
అయితే ఇంగ్లాండ్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన స్టోక్స్.. అనంతరం బ్యాటింగ్‌లో 52 పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టును జగజ్జేతగా నిలిపాడు. పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను స్టోక్స్ అదుకున్నాడు. హ్యారీ బ్రూక్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం బ్రూక్ ఔటైనప్పటికీ.. స్టోక్స్ మాత్రం ఎక్కడా పాక్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. అఖరికి విన్నింగ్ రన్స్ కూడా స్టోక్స్ బ్యాట్ నుంచే వచ్చాయి.
2019 వన్డే ప్రపంచకప్‌లో..
2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకోవడంలోనూ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 84 పరుగులు చేసిన స్టోక్స్.. జట్టుకు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో కూడా స్టోక్స్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ కూడా డ్రా కావడంతో.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్‌లో కూడా మూడు బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 8 పరుగులు సాధించాడు.