ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) త్వరలో నిర్వహించనున్న 'ది హండ్రెడ్'(The Hundred) టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్(David Warner), మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) తప్పుకున్నారు. కరోనా సమయంలో ప్రయాణ సమస్యలతో పాటు అంతర్జాతీయ టీ20 సిరీస్‌లు ఉన్న కారణంగా వారిద్దరూ టోర్నీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. అయితే టోర్నీ నుంచి తప్పుకున్న వీరిద్దరూ సదరన్ బ్రేవ్(Southern Brave) అనే టీమ్‌కు చెందినవాళ్లే కావడం విశేషం.
"డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లు టోర్నీకి దూరమవ్వడం చాలా నిరాశ కలిగించింది. కానీ, కొవిడ్ సంక్షోభంలో సవాళ్లు, ఆంక్షలను విదేశీ ఆటగాళ్లు అధిగమించడం కష్టమనే విషయాన్ని మేము గ్రహించాం. ఈ నేపథ్యంలో సదరన్ బ్రేవ్ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపిక జరుగుతుంది. ఏది ఏమైన అనుకున్న సమయానికి టోర్నీని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి".
- ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు
'ది హండ్రెడ్' ఆరంభ టోర్నీలో పురుషులతో పాటు మహిళా టీమ్‌లూ ఆడనున్నాయి. మహిళల టోర్నీలో ఐదుగురు భారత మహిళా క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమియా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఈ టోర్నీలో ఆడనున్నారు.
టీ20 ఫార్మాట్లో అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్న షెఫాలీ వర్మ.. సోఫీ డెవిన్ అనే న్యూజిలాండ్ క్రికెటర్ స్థానంలో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టులో ఆడనుంది. జులై 21న జరగనున్న టోర్నీ ఆరంభమ్యాచ్‌లో కియా ఓవల్ టీమ్‌పై మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో హర్మన్‌ప్రీత్ ఆడనుంది. మరోవైపు నార్తరన్ సూపర్ఛార్జర్స్ జట్టుకు జెమియా రోడ్రిగ్స్, సదరన్ బ్రేవ్ టీమ్‌కు స్మృతి మంధాన, హీథర్ నైట్ జట్టుకు దీప్తి శర్మ ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఇదీ చూడండి.. Racism in Cricket: మోకాళ్లపై సంఘీభావం తెలిపితే సరిపోదు!