టీ20 ప్రపంచకప్‌నకు(T20 World Cup 2021) సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో భారత జట్టుకు మాజీ సారథి ధోనీ మెంటార్‌గా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా(T20 World Cup 2021 India Team) తప్పకుండా కప్ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు చాలా మంది అభిమానులు. ఈ మెగా టోర్నీపై పలువురు తెలుగు క్రికెట్ నిపుణులు ఏమన్నారంటే..
ఇప్పటికే యూఈఏలో ఐపీఎల్ అడుతున్న భారత ఆటగాళ్లకు అక్కడి పిచ్‌లను ఆకళింపు చేసుకునే ఉంటారు. పైగా 2007లో టీ20 ప్రపంచకప్‌ను అందించిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ మెంటార్‌గా(Dhoni Mentor) ఉండటం భారత జట్టుకు గొప్ప వరం.. బలం. ధోనీ నుంచి కెప్టెన్సీ అందుకున్న విరాట్ కోహ్లీకి ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాబట్టి కచ్చితంగా టీ20 ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందన్న నమ్మకముంది.
ఆటగాళ్లు చాలా ఫిట్‌గా ఉన్నారు..
ఐపీఎల్(IPL 2021) పూర్తయిన వెంటనే ఐసీసీ టోర్నీ ఆడితే ఆటగాళ్లపై భారం పడుతుందనే కొందరి వాదన కరెక్ట్ కాదు. ఫిట్‌నెస్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ప్రస్తుతం ఏ సమయంలో ఏ ఫార్మాట్లలో ఆడేందుకైనా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటున్నారు. ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచేందుకు, ఇప్పటికే యూఈఏలో ఆడిన అనుభవం ఉండటం వల్ల ఐసీసీ మ్యాచ్‌లను ఎలా ఆడాలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయడానికి భారత్‌కు మంచి టీమ్ ఉంది. పిచ్ స్వభావాన్ని బట్టి పేస్ బౌలర్లు రాణించగలిగితే మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఖాయం!
ధోనీ సూచనలు.. సలహాలు చాలా ముఖ్యం..
యువ క్రికెటర్లకు మెంటర్‌గా సలహాలు, సూచనలు ఇవ్వడంలో, జట్టు వ్యూహాల్లో మెంటర్‌గా ధోనీ(Dhoni Mentor) సేవలు జట్టుకు అదనపు బలం కానున్నాయి. ప్రత్యర్థి భారీ స్కోరు చేసి సవాల్ విసిరినా.. మన జట్టు కాస్త బలహీనపడినా ఆటగాళ్లలో ధోనీ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి వెనకుండి నడిపించగలడు. జట్టు వ్యూహ రచనల్లోనూ కీలకంగా వ్యవహరిస్తాడు.
స్పిన్ దళం గట్టిదే.. కానీ..!
"మొదటి నుంచి భారత జట్టులో స్పిన్ దళం బలోపేతంగానే ఉంది. అయితే.. పిచ్ స్వభావం, తేమ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి మ్యాచ్ రోజు వ్యూహరచనలో బరిలోకి స్పిన్నర్లను దింపాలా? మీడియం/స్లో పేసర్లను దింపాలా? అనేది నిర్ణయించాలి. భారత జట్టుకు విజయం చేకూర్చడంలో విరాట్ కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రి కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. అలాగే.. పిచ్ స్వభావాన్ని బట్టి బౌలింగ్ శైలిని మార్చడంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ దిట్ట" అని ఎల్బీ స్టేడియం కోచ్ రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదన్న మచ్చ ఉంది. అయితే, ఇది అతనికి చివరి ప్రయత్నంగా భావించొచ్చు. కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడు. ఇక ఎం.ఎస్.ధోనీ మెంటర్‌గా ఉండటం వల్ల జట్టు కూర్పులో సహాయసహకారాలు అందుతాయి. కాబట్టి.. టీ20 ప్రపంచకప్ గెలవడంలో భారత్‌కు మంచి అవకాశాలున్నాయి.
శార్దూల్ ఠాకూర్ ఎంపిక సరైందే..
యూఏఈలో పిచ్‌లు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ పిచ్‌లపై స్పిన్నర్స్, మీడియం పేసర్స్ ముఖ్యపాత్ర పోషిస్తారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి ఎంపిక చేయడం మంచి పరిణామం. ధోనీ, కోహ్లీ గతంలో ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడారు. ఇప్పుడు వారిద్దరూ కెప్టెన్, మెంటర్ వ్యవహరిస్తుండటం ఒక ఛాలెంజ్‌గా ఉంటుంది.
పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి..
భారత్, పాక్ మ్యాచ్(Ind vs Pak 2021) ఒక అద్భుతమైన ఆటగా ఉండబోతుంది. ఐసీసీ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఎక్కువగా భారత జట్టే విజయాలు సాధించింది. ఇతర దేశాల కంటే భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ చాలా బాగుంది. ఐపీఎల్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది. అలుపెరుగకుండా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది మనకు సానుకూలాంశం. పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం ఆటగాళ్లతోసహా అందరూ ఎదురుచూస్తున్నారు.
టీ20లో అన్ని జట్లు ఒక్కటే..
టీ20 ఫార్మాట్‌లో అన్ని జట్లు సమానమే. తనదైన రోజున ఏ జట్టు అయినా విజయం సాధించగలదు. అయితే, భారత్‌కు అన్ని విధాలుగా ఆలోచించే తెలివైన కోచ్‌లు ఉన్నారు. భరత్ అరుణ్, రవిశాస్త్రి, శ్రీధర్‌తోపాటు ఇప్పుడు జట్టులో మెంటర్‌గా ధోనీ చేరాడు. కాబట్టి.. అన్ని దేశాలకంటే భారత్‌దే మేటి జట్టుగా చెప్పొచ్చు. అయితే, భారత్‌కు దీటుగా పోటీ ఇచ్చేవి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లే.
ఓపెనర్లుగా వీళ్లే..
"భారత ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్‌రాహుల్.. మూడో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రావొచ్చు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ది మంచి జోడీ. ఒకవేళ రైట్‌హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కోణంలో చూస్తే ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా తీసుకొచ్చే అవకాశముంది. వికెట్ కీపర్‌తో కలిపి ఆరుగురు బ్యాటర్లను, ఒక ఆల్‌రౌండర్ సహా ఐదుగురు బౌలర్లతో మ్యాచ్ రోజు పరిస్థితులను బట్టి జట్టు కూర్పుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తుదిజట్టు బ్యాటర్ల ఎంపికలో భారత్‌కు చాలా ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటింగ్ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో, పిచ్ పరిస్థితులను విశ్లేషించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషిస్తారు" అని మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:T20 world cup 2021: టీమ్ఇండియా క్రికెటర్లు.. చదువులో డ్రాప్ అవుట్స్