Sydney Test 2021 and 2022: ఏ క్రికెటర్ అయినా తానొక పరిపూర్ణ ఆటగాడిగా నిరూపించుకునే ఫార్మాట్ ఏదైనా ఉందంటే టెస్టు క్రికెట్ మాత్రమే. టీ20, వన్డేల్లో బంతిని బాదడమే పనిగా ఉంటుంది. ఎందుకంటే ఓవర్లు పరిమితంగా మాత్రమే ఉంటాయి. అలా కాకుండా ఐదు రోజులపాటు.. రోజుకు 90 ఓవర్లను తట్టుకుని నిలబడితేనే టెస్టుల్లో ఫలితం దక్కుతుంది. దీనికి ఎంతో ఓర్పు, సహనం, టెక్నిక్ ప్రదర్శించాలి. పిచ్ పరిస్థితులను అంచనా వేయకుండా దూకుడుగా ఆడేసి రన్స్ చేద్దామనుకుంటే అన్నివేళలా సాధ్యపడదు. అది తుది ఫలితం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
కఠినమైన ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎదుర్కొని జట్టును ఓటమి నుంచి తప్పిస్తే అభిమానుల దృష్టిలో హీరోలవుతారు. మరిప్పుడు ఎందుకంటారా..? సరిగ్గా ఏడాది కిందట ఇలానే సిడ్నీ మైదానంలో టీమ్‌ఇండియా అద్భుతంగా పోరాడి డ్రాగా ముగించగా.. ఇప్పుడు ఇంగ్లాండ్ టెయిలెండర్ బ్యాటర్లు ఆసీస్ విజయానికి అడ్డుపడ్డారు. హా.. టెస్టు క్రికెట్‌ను ఎవరు చూస్తారులే అనుకునే వారికి అసలైన రుచి చూపించారు. మరి ఆ విశేషాలు ఏంటో గుర్తుకు తెచ్చుకుందాం..
మొదట పంత్ దంచాడు.. ఆఖర్లో వారిద్దరు ఆపారు
నాలుగు టెస్టుల సిరీస్‌లో అప్పటికే భారత్, ఆసీస్ జట్లు చెరో విజయంతో మంచి ఊపులో ఉన్నాయి. ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. సిడ్నీ మైదానం వేదికగా గతేడాది జనవరి 7 నుంచి జనవరి 11వ తేదీ వరకు మూడో టెస్టు మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. అయితే టీమ్‌ఇండియా 244 పరుగులకే పరిమితమైంది. 94 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆతిథ్య జట్టు 312/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది.
- ఆసీస్ నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే దక్కింది. రోహిత్ శర్మ (52), శుభ్‌మన్ గిల్ (31) నిలకడగా ఆడారు. తర్వాత పుజారా (77), రిషభ్ పంత్ (97) జోడీ శతక భాగస్వామ్యం నిర్మించింది. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో టీమ్‌ఇండియా (272/5) ఇబ్బందుల్లో పడింది. వెనుక రవీంద్ర జడేజా, విహారి, అశ్విన్ మినహా బ్యాటర్లు ఎవరూ లేరు. ఆసీస్‌కు 40 ఓవర్లకుపైగా ఉన్నాయి.
- అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)తో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్) జత కలిశాడు. దీంతో విహారి-అశ్విన్ కలిసి జట్టును సురక్షిత స్థానానికి చేర్చే బాధ్యతను తలెత్తుకున్నారు. ఈ జంట దాదాపు 256 బంతులను ఎదుర్కొని మరీ కేవలం 62 పరుగులే చేసి వికెట్‌ను చేజారనివ్వలేదు. దీంతో ఆఖరికి 131 ఓవర్లలో 334/5 స్కోరుతో టీమ్‌ఇండియా ఐదో రోజును ముగించింది. డ్రాతో గట్టెక్కింది.
- ఏదో పది ఓవర్లను అడ్డుకుంటున్నారని భావించిన ఆసీస్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చారు. మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, గ్రీన్ వంటి ఫాస్ట్ బౌలర్లను లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎదుర్కొని నిలబడతారని ఎవరూ ఊహించలేదు. కఠినమైన బౌన్సర్లకు తమ బాడీనే అడ్డుగా పెట్టి క్రీజ్‌లో పాతుకుపోయారు. దీంతో మాజీ క్రికెటర్లు సహా అభిమానులు విహారి, అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత టెస్టు క్రికెట్‌లో సిడ్నీ టెస్టు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
స్వదేశంలో యాషెస్.. డామినేషన్ వారిదే
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాదే ఆధిక్యం. అదీనూ స్వదేశీ పిచ్‌ల మీద చెలరేగుతారు. అందరూ అనుకున్నట్లుగానే తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. ఇప్పటికే విమర్శలు తారస్థాయికి చేరాయి. కెప్టెన్సీని మార్చేయాలని వాదించేవారూ లేకపోలేదు. ఇక నాలుగో టెస్టులోనూ (జనవరి 5-9) ఓడితే ఇంగ్లాండ్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.. అయితే అసాధారణ ఆటతీరుతో ఓటమి నుంచి తప్పించుకుని డ్రాగా ముగించి కాస్త పరువు నిలబెట్టుకోగలిగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 416/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. తర్వాత ఇంగ్లాండ్‌ను 294 రన్స్‌కే ఆలౌట్ చేసేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 122 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 265/6 వద్ద డిక్లేర్డ్ చేసి ఇంగ్లాండ్ ఎదుట 388 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఖవాజా శతకాలు బాదడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 30/0తో నిలిచింది. ఇంకా 358 పరుగులను ఛేదించాల్సి ఉంది.
- చివరి రోజు 358 పరుగుల లక్ష్యం.. 90 ఓవర్లపాటు ఆట.. చేతిలో పది వికెట్లు.. మరోవైపు మాంచి ఫామ్‌లో ఉన్న ఆసీస్ బౌలర్లు.. ఎలాగైనా నాలుగో టెస్టునూ కైవసం చేసుకోవాలనే ఆకాంక్షతో ఉన్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలే (77), బెన్ స్టోక్స్ (60) అర్ధశతకాలు సాధించారు. అయితే మలన్ (4), హబీద్ (9) పరుగుల పరంగా విఫలమైనా.. బంతులను వృథా చేశారు. విజయం సాధించలేనప్పుడు కనీసం డ్రా కోసమైనా పోరాడటం టెస్టు క్రికెట్‌లో సర్వసాధారణం.
- అయితే ఆసీస్ బౌలర్లు విజృంభించి స్వల్ప వ్యవధిలో బెన్ స్టోక్స్, బట్లర్ (11), మార్క్‌వుడ్ (0), బెయిర్‌స్టో (41)ను పెవిలియన్‌కు పంపారు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 237/8. ఇంకో 10 ఓవర్ల ఆట మిగిలి ఉంది. చేతిలో ఇంకా రెండే వికెట్లు ఉన్నాయి. లీచ్ (26) వేగంగా పరుగులు చేసి తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇంకా అప్పటికి రెండు ఓవర్లు ఉన్నాయి. క్రీజ్‌లో స్టువర్ట్ బ్రాడ్ (35 బంతుల్లో 8 నాటౌట్) ఉన్నాడు. లీచ్ ఔట్ కావడంతో అండర్సన్ (ఆరు బంతుల్లో 0 నాటౌట్) బ్యాటింగ్‌కు వచ్చాడు. వీరిద్దరూ వికెట్ ఇవ్వకుండా ఆడేసి జట్టును ఓటమి నుంచి రక్షించారు. ఆఖర్లో వాతావరణం బాగోక స్పీడ్ తక్కువగా ఉండే బౌలర్లతోనే ఆసీస్ బౌలింగ్ చేయాల్సి రావడం కూడానూ ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది.
ఇదీ చదవండి:
Ashes 2021: ఉత్కంఠరేపిన నాలుగో టెస్టు.. చివరికి డ్రా
'రూట్ సేనకు.. టీమ్‌ఇండియా 'సిడ్నీ' సూపర్ ఇన్నింగ్సే ఆదర్శం'